CM Revanth Reddy: దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయండి.. కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి సూచన

by Prasad Jukanti |

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

CM Revanth Reddy: దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయండి.. కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం చెప్పారు. ఇవాళ ఉదయం హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పంపిణీ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే దీనిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి సూచనపై స్పందిచిన ప్రహ్లాద్ జోషి.. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కాగా రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. పేదలకు పోషకాహారం అందించే లక్ష్యంతో దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేలా రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story