దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్

by Taduka Kalyani |

సీఎం రేవంత్ రెడ్డి తీరు పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి తీరు పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడే అలవాటు లేదన్నారు. రైతు బంధు 45 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తానని సిద్దిపేట నియోజకవర్గం నర్మెట లో హామీ ఇచ్చి 80 రోజులు గడుస్తున్న పూర్తిగా రైతు బంధు వేయని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. మరో రెండు పర్యాయాలు అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్న ఎమ్మెల్యే లతో రాజీనామా చేయిస్తే ప్రజా క్షేత్రంలో తెల్చుకుందామని హరీష్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మిలాన్ గార్డెన్ లో ఎస్ ఐ ఆర్ పై బీఎస్ వో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...అధికార మదంతో బీఆర్ఎస్ పార్టీని ఉప్పు పాతర వేస్తానని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఉప్పు పాతర వేస్తారన్నారు. రైతు భరోసా కింద రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 పర్యాయాలుగా 29 వేల కోట్లు బాకీ పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పంట కొనుగోళ్లు, ఎరువుల పంపిణీ, రైతు భరోసా, రైతు బీమా పై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. 2020-21 లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 91 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. రైతు బంధు, రైతు భరోసా, తడిచిన ధాన్యానికి పరిహారం, ఎరువులు అందించ నందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ ఎల్ బీసీ స్వరంగం పనులు 12 కిలో మీటర్ల మేర పూర్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల 8 నెలల పాలనూ 12 మీటర్లు కూడా స్వరంగం తవ్వని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పైగా 8 మంది కార్మికులకు బలిగొని, శవాలను సైతం బయటకు తీయలేదన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి సింగరేణి టెండర్ శోధ కన్ స్ట్రక్షన్ పేరిట సృజన్ రెడ్డి కి కాంట్రాక్టు కట్ట బెట్టారన్నారు. అవినీతిని బయట పెట్టడంతో టెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం కూలిపోతే మూసీ కి, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీరు ఎక్కడిదని సూటీగా ప్రశ్నించారు. కృష్ణ జలాలతో నల్గొండ ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో నల్గొండలో బత్తాయి మార్కెట్, నకిరేకల్ లో నిమ్మకాయల మార్కెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కర్ణాటకలో మూడు రాష్ట్రాల సీఎంల మీటింగ్ మతలబు ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎత్తు పేరిట పరుష పదజాలంతో తిడతూ ఆరు గ్యారంటీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. మైక్ దొరికే మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ నేతలను తిడుతూ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story