కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తి

by Muthe.Rajitha |

కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై కాంగ్రెస్​పార్టీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉంది.

కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై కాంగ్రెస్​పార్టీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉంది. వారి పని తీరు, ప్రతిపక్షాల విమర్శలపై వారు స్పందిస్తున్న తీరు.. ఏమాత్రం ఆశాజనకంగా లేదని గుర్తించారు. రాష్ట్రంలో 40 మంది పైగా కార్పొరేషన్​ చైర్మన్, కమిషన్ల చైర్మన్‌లను నియమించారు. వీరి నియామకం లోక్‌సభ ఎన్నికలకు ముందే జరిగినా.. ఎన్నికల తరువాత అమల్లోకి వచ్చాయి. వీరు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలకుపైగా గడిచినా వేళ్ల మీద లెక్కపెట్టే వారు మినహా, మిగిలిన వారు ఆశించినంతగా పని చేయడంలేదని తేలింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం చేరింది.

అంటిముట్టనట్టుగా కార్పొరేషన్ చైర్మన్లు..

ప్రతిపక్షం అధికార పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, సీఎంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నా కమిషన్ చైర్మన్లు స్పందించడం లేదని గుర్తించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం.. పదవులు వచ్చాయి ఇంకెందుకు అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారని టాక్. కమిషన్ల చైర్మన్‌‌లు, సభ్యులు రాజకీయంగా స్పందించడానికి వీలు లేదు. దీంతో వారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా పనిచేస్తున్నారని సీఎం నోటీసుకు వచ్చింది. కానీ, కార్పొరేషన్​చైర్మన్లు మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఓ అంచనాకు వచ్చారు. వీరితో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గతంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వచ్చేలా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో చైర్మన్లు చేసిన తప్పిదాలు, కుంభకోణాలను వెలికి తీసి ప్రజలకు వివరించాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా.. ఎవరూ స్పందించినట్టుగా కనిపించడం లేదు. గతంలోని చైర్మన్లు ఇష్టారీతిన ఖర్చులు చేసి కోట్ల రూపాయలను నిధులను డ్రా చేశారు. వ్యక్తిగత సిబ్బంది నియామకం, కార్పొరేషన్​ద్వారా కేటాయింపులు తదితర వాటిని గుర్తించవచ్చని చెప్పినా? ఎవరూ స్పందించడం లేదని తేలింది. కొందరైతే కార్పొరేషన్​ చైర్మన్‌గా ఉన్నారా ? అని కూడా తెలియనంతగా డల్​అయ్యారని సమాచారం. ఎక్కడా పర్యటించకుండా, సమీక్షలు చేయకుండా కార్పొరేషన్‌పై కనీస అవగాహన కూడా లేకుండా ఉన్నట్లు గుర్తించారు. భర్తీ కానీ చైర్మన్​పోస్టుల విషయంలో పలువురు కీలక నేతలకు గుర్తుచేయగా.. పదవులు వచ్చిన వారు బాగా స్పందిస్తున్నారు.

ఇక వారికి నో రెన్యువల్?

ఇక మీరు స్పందించక ఆగిపోయిందా? అనే రీతిలో జవాబులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కారణం కూడా ఇన్నాళ్లు చైర్మన్​పోస్టుల భర్తీపై వేగం పెంచకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది.ఇప్పటికే పదవులు ఇచ్చిన వారు చురుగ్గా, ఉత్సాహంగా స్పందించి ఉంటే మిగిలిన పోస్టులను త్వరగా భర్తీచేసేవారని పార్టీలో టాక్ నడుస్తోంది. కానీ, పదవులు వచ్చిన వారు ఇంకా గల్లీ లీడర్లు గానే ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 7 నెలల పదవీ కాలం ముగిసినందున మరో సంవత్సరన్నరలో వీరి పదవి ముగియనుంది. ఆ తర్వాత వీరికి ఎవ్వరికి కూడా రెన్యూవల్​ఉండదనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కార్పొరేషన్ ​చైర్మన్​ ఆశించి పదవి రాని వారు మరోరకంగా ఉన్నారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడినా పదవి రాలేదని, పదవులు వచ్చిన వారు స్పందిస్తారులే, మాకేందుకు.. మేము ఎందుకు స్పందించాలనే రీతిలో అసంతృప్తిని తెలియజేస్తున్నారు. వీరిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మిగిలిన పోస్టులను భర్తీ చేసే విషయంలో ఉత్సాహంగా పనిచేసే వారినే గుర్తించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి.

Next Story