మూడుగంటలకు పైగా సుదీర్ఘ డిస్కస్.. అధికారులపై సభ్యుల అసంతృప్తి

by Gantepaka Srikanth |

సమావేశాలకు తగినంత సమాచారంతో రావాలని పీఏసీ సభ్యులు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

మూడుగంటలకు పైగా సుదీర్ఘ డిస్కస్.. అధికారులపై సభ్యుల అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమావేశాలకు తగినంత సమాచారంతో రావాలని పీఏసీ సభ్యులు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖపై ఈ సందర్భంగా సమీక్షించారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, నూతన ఆసుపత్రుల నిర్మాణం, ఆసుపత్రులలో మౌలిక వసతులు, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం, మెడిసిన్స్, డాక్టర్లు, సిబ్బంది సమస్యలు, పీజీ సీట్ల వివరాలు, మెడికల్ హెల్త్‌పై చర్చించారు. సుమారు మూడు గంటలకుపైగా సుదీర్ఘంగా ఈ చర్చ కొనసాగింది. ప్రజారోగ్యానికి సంబంధించి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అత్యంత ప్రాముఖ్యత కలిగినదని సూచించారు.

ఈ శాఖ ద్వారా మరింత సమర్థవంతంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాల అందించాలని సూచించారు. అలాగే.. శాఖకు సంబంధించి 2014-15 నుండి 2021-22 వరకు ఉన్న పెండింగ్ ఆడిట్ పే‌రాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కమిటీ సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, టి.భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్, శాసన మండలి కార్యదర్శి డా.వి.నరసింహాచార్యులు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పి.మాధవి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జడ్ చాంగ్తు, కమిషనర్ మెడికల్ హెల్త్ ఆర్వీ కర్ణన్, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాకేశ్ సి.సజ్జన్ హాజరయ్యారు.

పీఏసీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

అసెంబ్లీలో నిర్వహించిన 3వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎల్.రమణ బహిష్కరించి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికమని.. పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. హరీశ్‌రావు వేసిన నామినేషన్‌ను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకున్ని సంప్రదించి పీఏసీ చైర్మన్‌ను నియమించాలని.. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం గత రెండు పీఏసీ మీటింగ్‌లు బహిష్కరించామని.. చైర్మన్ ఎంపికపై పునరాలోచన చేయాలని కోరినా ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ సమావేశాన్ని కూడా నిరసన తెలియజేసి బహిష్కరించినట్లు ప్రకటించారు. అలాగే.. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని.. అందులో అరికేపూడి గాంధీ ఒకరని తెలిపారు. అనర్హత కేసు విచారణలో ఉండగా పార్టీ మారిన గాంధీని చైర్మన్‌గా నియమించి సమావేశాలు నడపడం సమంజసం కాదన్నారు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యేను సంప్రదాయానికి విరుద్ధంగా చైర్మన్‌గా నియమించినందుకు 3వ సమావేశాన్ని బహిష్కరించామన్నారు. ఇంకా 30 సార్లు జరిగినా బహిష్కరిస్తామని చెప్పారు. వెన్నుపోటు దారుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. గాంధీ స్థానంలో చైర్మన్‌గా హరీశ్‌రావును నియమించాలని డిమాండ్ చేశారు. సభ్యుల మైక్ కట్ అనేది అసెంబ్లీలో చూశామని.. కానీ పీఏసీ మీటింగులోనూ తాము మాట్లాడకుండా మైక్ కట్ చేశారని అన్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తప్పుడు ఆలోచనలతో పార్టీ మారిన సభ్యునికి చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. నామినేషన్ వేయని గాంధీకి ఎలా ఇస్తారని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన వారికి ఇవ్వకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చైర్మన్ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారని అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. బీఆర్ఎస్ పక్షాన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని.. పార్టీ సమావేశాలకూ ఆహ్వానిస్తున్నారని.. అలాంటప్పుడు వారిని ఏ ప్రాతిపదికన తమ పార్టీ సభ్యులుగా చూస్తారని నిలదీశారు.

Next Story