- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రేవంత్, భట్టి, ఉత్తమ్ మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీశ్ రావు
సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్లలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్‍లోనూ ఇదే జరిగిందన్నారు. వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చిందని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. నైనీ టెండర్ల అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి నైనీ బ్లాక్‍లో పెట్టారు, అందువల్ల నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారని అయితే ఈ కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎక్కడా లేదన్నారు. వెస్టన్ కోల్ ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా లేదు. అలాంటిది రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారన్నారు. ఈ విధానం వచ్చాక మొదటి లబ్దిదారులు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన కంపెనీ శోదా కన్స్ట్రక్షన్‍కే ఈ సర్టిఫికేట్ వచ్చాక మొదటి టెండర్ దక్కిందన్నారు. ఈ విధానం వచ్చాక సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్ కు టెండర్లు వారి అనుయాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు.కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు సైతం వెళ్లి కొట్లాడుతామని చెప్పారు.
కేబినెట్ దండుపాళ్యం ముఠా:
కేబినెట్ దండుపాళ్యం ముఠా అంటే నా మీద పడ్డారని సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులను ఎందుకు బలి పశువులు చేస్తున్నారని నిలదీశారు. వాటాల కోసం తన్నుకు చచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం ఇందులో జర్నలిస్టులు, ఐఏఎస్ లో ఏం పాపం చేశారని ప్రశ్నించారు. గతంలో డెక్కన్ సిమెంట్స్ యజమానిని సీఎం ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజ్‍లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పారు. సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి, టెండర్లు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బికి మార్చి టెండర్లు దక్కించుకున్నారు. హాలో గ్రామ్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలి అయ్యారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రి వర్సెస్ కోమటి రెడ్డి పంచాయతీ ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ రూ.8 కోట్ల కోసం కాంట్రాక్టర్ నే బెదిరిస్తే ఆ కాంట్రాక్టరే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇన్ని పంచాయతీలు నడుస్తున్నాయని దీంతో ఆరు గ్యారెంటీలు అటకెక్కి వాటాలా పంచాయతీలు ముందుకు వచ్చిందని ధ్వజమెత్తారు.
సర్కస్ నడుపుతున్నరా?:
బీఆర్ఎస్, జర్నలిస్టులను వేధించడానికి సిట్లు వేస్తున్నారని కాకీ బుక్కు అందరికి సమానం అనే డీజీపీ శివధర్ రెడ్డి.. మీ ఖాకీ బుక్కు కాకీ ఎత్తుకుపోయిందా? అని ప్రశ్నించారు. సజ్జనర్ జర్నలిస్టులను బెదిరించావు కదా? ఏమైంది హూంకరింపు. ఇవన్నీ కనిపించడం లేదా అని నిలదీశారు. కేసీఆర్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తయారు చేస్తే, కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలకు తెరలేపారన్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా సిట్ ఎలా వస్తుంది. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ వస్తే ముఖ్యమంత్రిగా మీరు ఫెయిల్ అయినట్టే కదా అన్నారు. మీరు సర్కార్ నడుపుతున్నరా, సర్కస్ నడుపుతున్నరా? అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే దుమ్ము దుమ్మే:
బీఆర్ఎస్ గద్దెల విషయంలో రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుందని దుమ్ముదుమ్ము అయిపోతావు జాగ్రత్త అని హెచ్చరించారు. నువ్వు కూలిస్తే కూలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో లేదని ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఇకనైనా హౌలా మాటలు బంద్ చేసి.. ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలన్నారు. నిన్నటి కేబినెట్ మీటింగ్ లో రైతు బంధుపై, ఎరువుల కొరతపై చర్చే లేదని, ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల ప్రస్తావనే లేదని విమర్శించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తే తెలుగు దేశం పార్టీ పుట్టింది. ఎన్టీఆర్ కాంగ్రెస్‍కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టారు కదా? తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్‍కు వ్యతిరేకం అని గుర్తు చేశారు.
నాలుగు ఓట్ల కోసమే టీడీపీ ప్రస్తావన:
రేవంత్ రెడ్డికి అంత ప్రేముంటే తెలుగుదేశంలో ఉండాల్సింది. టీడీపీ నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేశావు . కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.నాలుగు ఓట్ల కోసం తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే, నువ్వేమో బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటున్నావ్ అని విమర్శించారు. కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ లీడర్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధాం ఇక్కడే ఎందుకు?:
ఎనీ ఓబీ కోల్ బ్లాక్ టెండర్ మన దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుంది. గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 పోయేది. మైనస్ 10 టు మైనస్ 20 ఎక్కడైనా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయన్నారు. భట్టి కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నారు. మరి మిగతా వాటి సంగతి ఏమిటి? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆన్ లైన్ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా వేయొచ్చు కానీ సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే ఈ విధానంలో ఎవరు ముందుగానే టెండర్ వేస్తున్నారో తెలుసుకొని, బెదిరించి, బయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమ అనుయాయకులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారు. నైనీ బ్లాక్‍లో ఇదే జరిగిందని వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్ లో లేని విధానం సింగరేణిలో ఎందుకు అనే దానిపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు.
పాత టెండర్లు రద్దు చేసి..
గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ సమయంలో ఉన్న టెండర్లు రద్దు చేసి వాటినే తమ అనుయాయులకు కట్టబెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. అప్పుడు కాంపిటీటివ్ విధానంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి ఇప్పుడు ప్లస్ 7 మీద టెండర్లు కట్టబెట్టారన్నారు. గతంలో వెంకటేషన్ కని అనే టెండర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7మీద రీ టెండర్ చేసి కట్టబెట్టారు. ఎస్‍ఆర్‍పీఎసీ టూ శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్ రద్దు చేసి, ప్లస్ 7లో అప్పగించారు. ఎస్‍ఆర్‍పీఓసీ టూ విస్తరణ 2025 టెండర్ మూడు సార్లు వాయిదా వేశారు. డీల్ సెట్ కాక మళ్లీ వారి అనుయాయులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించు:
సింగరేణి గతంలో బల్క్ లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారని హరీశ్ రావు అన్నారు. కానీ పర్సెంటేజీల కోసం డీజిల్‍ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారని దీని వల్ల సింగరేణికి ఎక్కువ నష్టం అని ఆరోపించారు. చేసిన పని మీదనే కాదు, డీజీల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల సంస్థకు నష్టం కదా? అని నిలదీశారు. ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరి సన్నిహితులు, సమీప బంధువు కనుసన్నల్లో జరుగుతున్నదన్నారు. ఎవరికి సర్టిఫికేట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా వారి ఆదేశం లేనిదే దక్కదన్నారు. చీటికి మాటికి సిట్ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలన్నారు. సీబీఐ విచారణ చేస్తే పూర్తి వివరాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రేవంత్ రెడ్డి, బిజేపీ అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. రెండేళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేరని ఇంచార్జీని పెట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు అన్ని నైనీ రద్దు చేశామని భట్టి విక్రమార్క అంటున్నారు. మిగతా అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం రద్దు చేయాలని, సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Read More..






