- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం.. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగ రావు అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం అవినీతి నిరోధక శాఖ ఆయన నివాసాలు ఇల్లు, బంధువుల ఇల్లు, బినామీల ఇళ్లతో కలిపి ఏకకాలంలో16 చోట్ల అధికారులు జరిపిన ఆకస్మిక సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తుల చిట్టా వెలుగుచూసింది. లభ్యమైన పత్రాల ప్రకారం ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువే సుమారు రూ.5.92 కోట్లు ఉంటుందని,మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఉండోచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ వెల్లడించారు.
కొండంత ఆస్తులు.. కళ్లు చెదిరే విలాసాలు..
తన సర్వీసును అడ్డం పెట్టుకుని భుజంగరావు తీవ్ర స్థాయికి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఈ తనిఖీల్లో దర్యాప్తు అధికారులు కళ్లుచెదిరే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏకంగా 27.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో 5 ఖరీదైన ఓపెన్ ప్లాట్లు, రెండు ఇళ్లు, ఒక కమర్షియల్ భవనం ఉన్నట్లు తేల్చారు. నివాసంలో జరిపిన తనిఖీల్లో కిలో బంగారు ఆభరణాలు, రూ.3.83 లక్షల నగదుతో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ.8 లక్షల నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. వీటితో పాటు మారుతీ స్విఫ్ట్, కియా సెల్టోస్ కార్లను ఏసీబీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఇంట్లో మినీ బార్.. 29 మద్యం సీసాలు
సోదాల సమయంలో దర్యాప్తు అధికారులకు భుజంగరావు నివాసంలో ఏకంగా 29 మద్యం సీసాలు లభించడం గమనార్హం. అనుమతికి మించి భారీగా ఇంట్లో మద్యం నిల్వ ఉంచడంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బృందం.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించింది. భుజంగరావుపై పలు సెక్షన్ ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
బినామీలపైనా నజర్.. నేడు కోర్టుకు..
భుజంగరావు అక్రమార్జనలో బినామీల పాత్రపైనా ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన నిందితుడు భుజంగరావును నేడు నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరచనున్నట్లు జేడీ సింధు శర్మ వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరుల ఫోన్లను అక్రమంగా నిఘా పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఈ కేసులో పలువురు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటుండగా, భుజంగరావు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ దాడులు జరగడం రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్ ఖాతా Telangana ACB, ఎక్స్ @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని జేడీ సింధు శర్మ సూచించారు.






