- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్..! మెడికల్ కాలేజీల్లో ఫీజు దందాకు బ్రేక్
రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల నిలువుదోపిడీపై ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు కాలేజీలు ఎట్టకేలకు దిగివస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల నిలువుదోపిడీపై ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు కాలేజీలు ఎట్టకేలకు దిగివస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి, ఐదో ఏడాది కూడా విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి ఫీజులను దండుకోవాలని చూసిన యాజమాన్యాలు వెనక్కి తగ్గుతున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు మాత్రమే అయినప్పటికీ, ఐదో ఏడాది కూడా పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ గతంలో విద్యార్థులను వేధించిన కాలేజీలు.. ఇప్పుడు దారిలోకి వస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్), తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిబంధనల ప్రకారం ఐదో ఏడాది కేవలం 50 శాతం ఫీజు మాత్రమే వసూలు చేస్తూ అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నాయి. దిశ కథనాల ఇంపాక్ట్‌తో ప్రైవేటు యాజమాన్యాల దందాకు బ్రేక్ పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 209 కోట్ల దోపిడీకి అడ్డుకట్ట
గత నెల 5వ తేదీన దిశ పత్రికలో ‘నాలుగున్నరేళ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజా?’ పేరిట ప్రైవేటు కాలేజీల అక్రమ వసూళ్లను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ-కేటగిరీ (2,963 సీట్లు), సీ-కేటగిరీ (872 సీట్లు) విద్యార్థులపై ఏటా సుమారు రూ. 209 కోట్ల అదనపు భారాన్ని మోపుతున్న వైనాన్ని వివరిస్తూ, గతంలో సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి కాలేజీలు పంపిన అక్రమ నోటీసులను దిశ వెలుగులోకి తెచ్చింది. కోర్సు చివరి ఏడాదిలో కేవలం ఆరు నెలల కాలానికి మాత్రమే ఫీజు వసూలు చేయాలన్న హైకోర్టు, వర్సిటీ ఆదేశాలను యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్న తీరుపై తల్లిదండ్రుల అసోసియేషన్ గళమెత్తింది. సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ప్రకటించింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వచ్చిన ఒత్తిడి, ‘దిశ’ కథనాల తీవ్రతతో కాలేజీలు లొంగిరాక తప్పలేదు.
దిగొచ్చిన ‘ఆర్వీఎం’ కాలేజీ
‘దిశ’ కథనాల అనంతరం ప్రైవేటు మెడికల్ కాలేజీల వైఖరిలో మార్పు మొదలైంది. ఇందుకు నిదర్శనంగా సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ తాజాగా విద్యార్థులకు జారీ చేసిన ఫీజు నోటీసు నిలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ బీ-కేటగిరీ ట్యూషన్ ఫీజు అసలు మొత్తం రూ. 11,55,000 కాగా, యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం అందులో ఖచ్చితంగా 50 శాతం (అనగా రూ. 5,77,500) మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. గైడ్‌లైన్స్ ప్రకారం ఫీజును 50 శాతానికి క్యాప్ చేశామని యాజమాన్యం స్వయంగా నోటీసులో పేర్కొనడం ‘దిశ’ సాధించిన నైతిక విజయంగా నిలుస్తోంది.
‘దిశ’కు తల్లిదండ్రుల ప్రత్యేక కృతజ్ఞతలు
ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమంటూ కాలేజీలు గతంలో సైకలాజికల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాయని, హామీ పత్రాలు రాయించుకుని వేధించాయని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో ‘దిశ’ పత్రిక తమకు అండగా నిలిచి, యాజమాన్యాల అక్రమాలను నిలదీసిందని కొనియాడారు. పత్రిక కథనాల వల్లే ఒక్కో విద్యార్థి కుటుంబానికి దాదాపు రూ. 6 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు ఆర్థిక భారం తప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రైవేటు కాలేజీల దోపిడీని అడ్డుకున్న ‘దిశ’ దినపత్రికకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన కాలేజీలు కూడా ఇదే బాటలో నడిచేలా అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ డిమాండ్ చేశారు.






