Disha Effect: ఎంబీబీఎస్ ఫేక్ లెటర్స్.. సైబర్ క్రైమ్‌కు కాళోజీ వర్సిటీ ఫిర్యాదు

by Kema Shiva Kumar |

Disha Effect: ఎంబీబీఎస్ ఫేక్ లెటర్స్.. సైబర్ క్రైమ్‌కు కాళోజీ వర్సిటీ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్‌యూహెచ్‌ఎస్) పరిధిలోని ఎంబీబీఎస్ పరీక్షల వాయిదా పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ సర్క్యులర్లపై 'దిశ' దినపత్రిక ప్రచురించిన "ఎంబీబీఎస్ ఫేక్ లెటర్స్..." కథనానికి యూనివర్సిటీ యంత్రాంగం వేగంగా స్పందించింది. విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ ఫేక్ లెటర్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. రమేష్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె. నాగార్జున రెడ్డి సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణను సైతం ముమ్మరం చేశారు. మరోవైపు, ఈ నకిలీ నోటిఫికేషన్ల వల్ల విద్యార్థులు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు అత్యవసర సర్క్యులర్ పంపుతూ విద్యార్థులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

సంతకం లేని వాటిని నమ్మొద్దు: ప్రిన్సిపల్స్‌కు రిజిస్ట్రార్ ఆదేశాలు

ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు వర్సిటీ సర్క్యులర్‌ జారీ చేసింది. పరీక్షలకు సంబంధించిన ఎలాంటి ఫైల్, నోటిఫికేషన్ లేదా సర్క్యులర్ అయినా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) సంతకం లేకుండా విడుదల కాదని స్పష్టం చేసింది. కేవలం ఉత్తర్వుల కింద సంతకం లేకుండా ఒట్టి "Sd/-" అని మాత్రమే రాసి ఉంటే, అటువంటి వాటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని స్పష్టం చేశారు.

యూనివర్సిటీకి సంబంధించిన పరీక్షలు, ఫలితాలు లేదా ఎలాంటి అధికారిక ప్రకటనలైనా కేవలం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ (www.knruhs.telangana.gov.in) ద్వారానే లభ్యమవుతాయని, దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఓఈ అధికారిక ఈ-మెయిల్ ఐడీ ద్వారా అధికారికంగా కమ్యూనికేట్ చేసిన సమాచారాన్ని మాత్రమే విద్యార్థులకు, ఫ్యాకల్టీకి చేరవేయాలని ప్రిన్సిపల్స్‌కు దిశానిర్దేశం చేశారు. పరీక్షల సమయంలో ఇటువంటి సున్నితమైన అంశాలపై అక్రమాలకు పాల్పడే వారిపై పోలీసులు, యూనివర్సిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్సిటీ అధికారులు భరోసా ఇచ్చారు.

Next Story