జర్నలిజం ప్రమాదంలో ఉంది.. కారణం అదే: దిశ ఎడిటర్ మార్కండేయ

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-29 12:03:40  IST  )

జర్నలిజం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని దానికి కారణం సోషల్ మీడియానే అని దిశ దినపత్రిక ఎడిటర్ మార్కండేయ అన్నారు.

జర్నలిజం ప్రమాదంలో ఉంది.. కారణం అదే: దిశ ఎడిటర్ మార్కండేయ
X

దిశ, అచ్చంపేట : జర్నలిజం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, దానికి కారణం సోషల్ మీడియానే అని ‘దిశ’ దిన పత్రిక ఎడిటర్ మార్కండేయ అన్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా ‘వార్త కథనాలు, ప్రత్యేక కథనాలు’ అనే అంశంపై ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ.. పాఠకులు సోషల్ మీడియాలో వస్తున్న చిన్న సమాచారాన్ని కూడా ఆసక్తిగా చూస్తున్నారని, దానికి అనుగుణంగానే డిజిటల్ మీడియా పరుగులు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత పెరిగిందని, విలేకరులు ప్రస్తుతం మారుతున్న సమాజ మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధాన స్రవంతి పత్రికలు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయని, ఎప్పటికప్పుడు క్షణాల్లో సమాచారం ప్రజలకు అందుతున్న నేపథ్యంలో నేటి వార్తల కోసం పాఠకులు రేపటి వరకు వేచి ఉండటం లేదని మార్కండేయ పేర్కొన్నారు.

జర్నలిజంపై AI ప్రభావం..

పలు ప్రధాన స్రవంతి పత్రికలు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ కొనసాగలేని పరిస్థితుల్లో ‘దిశ’ తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని మార్కండేయ గుర్తు చేశారు. ప్రస్తుతం AI టెక్నాలజీ మరింత ప్రభావితం చేస్తుందని, ఒక విషయానికి సంబంధించి ఒకేసారి దాదాపు 21 ప్లాట్‌ఫామ్స్ నుంచి సమాచారం సేకరిస్తూ మనకు సమాధానం ఇస్తున్నదని తెలిపారు. దిశ లాంటి డిజిటల్ మీడియా పత్రికలు ఇంకా రావాలని ఆకాంక్షించారు. ఏ మీడియా అయినా వాస్తవాలు లేకపోతే పాఠకులు ఆదరించరని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక దిశ పత్రిక అచ్చంపేట ఇన్‌చార్జి మంచాల లక్ష్మీపతి ఆధ్వర్యంలో తెలకపల్లి రిపోర్టర్ ఎల్ల స్వామి, అమ్రాబాద్ రిపోర్టర్ యాకర్ ఎడిటర్ మార్కండేయని సన్మానించారు.




Next Story