చిన్న కాంట్రాక్టర్లకు అండగా ఉంటాం

by velandi.Saikiran |

చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భట్టి స్పష్టం చేశారు.

చిన్న కాంట్రాక్టర్లకు అండగా ఉంటాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను కలిశారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, దశలవారీగా బిల్లులన్నింటినీ పూర్తిగా చెల్లించి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకుముందు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరిపిన చర్చల సారాంశాన్ని డిప్యూటీ సీఎంకు వివరించారు.

రూ. 4వేల కోట్ల బకాయిలు పెట్టారు: మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను తమ ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. మంత్రుల నివాస సముదాయంలో బిల్డర్స్, కాంట్రాక్టర్లతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం వల్ల ఒక్క ఆర్‌అండ్‌బీ శాఖలోనే రూ.4,000 కోట్లు, యాదాద్రి దేవస్థానం పనులకు సంబంధించి రూ.350 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బకాయిలు ఒక దశలో రూ.8,000 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడుల్లో ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్లకు రూ.3,000 కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామన్నారు. చిన్న కాంట్రాక్టర్లు, ఎల్ఈడీ లైట్ల పనులు చేసిన సంస్థలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం ఇప్పటికే రూ.140 కోట్ల మేర చెల్లింపులు జరిపామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

రూ.20 వేల కోట్ల టెండర్లు..

రాష్ట్రంలో రోడ్ల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి, రూ.13 వేల కోట్ల విలువైన హ్యామ్ రోడ్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.10,410 కోట్ల వ్యయంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లు, రెండు సర్వీస్ రోడ్లతో విస్తరిస్తామన్నారు. అమరావతి, మచిలీపట్నం దిశగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, నల్గొండలో డ్రై పోర్ట్ ప్రతిపాదన, మంచిర్యాల–నాగపూర్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పరిధిలో ఇప్పటికే రూ.20,000 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయని వివరించారు.

‘చలో హైదరాబాద్’ వాయిదా: రవీందర్ రెడ్డి

పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అసోసియేషన్ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story