అధికార పార్టీకి పక్కలో బల్లెంలా ఆ లేడీ లీడర్.. క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు!

by Kema Shiva Kumar |

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీకి పక్కలో బల్లెంలా ఆ లేడీ లీడర్.. క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గాంధీభవన్‌లో ధర్నాలు, నిరసనలకు దిగడం, సొంతపార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు చేస్తుండడం పార్టీవర్గాల్లో చర్చకు దారితీస్తున్నది. నామినేటెడ్, పార్టీ పదవుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. మళ్లీ గాంధీ భవన్ లో ధర్నా చేయడం, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నిరసనలు.. నిలదీతలు..

పార్టీ నేతలపై సునీతా రావు అనేక సార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలోనూ గాంధీభవన్ లో నిరసనలు తెలిపారు. రాహుల్ గాంధీ నారీ న్యాయ్ ఏమైందని నిలదీశారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. గతంలో మహిళా కాంగ్రెస్ కు పెద్దగా గుర్తింపు లేనప్పటికీ.. రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేశానని, ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టానని ఆమె గుర్తు చేశారు. విజయం సాధ్యం కాని గోషామహల్ టికెట్ వద్దని చెప్పినా.. అక్కడి నుంచి తనను బరిలో నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవని చెప్పి.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారని పేర్కొన్నారు. అయినా అందులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పీసీసీ చీఫ్ బంధువులకే పదవులు

పదవులన్నీ పీసీసీ చీఫ్ తన చెల్లెళ్లు, మరదళ్లకు ఇచ్చుకుంటున్నారని సునీతారావు ఆరోపించారు. బుధవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. వీ వాంట్ జస్టిస్, మహిళా కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు కమిటీల్లోనూ ఎలాంటి అవకాశం కల్పించడం లేదని సునీతారావు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పని చేస్తున్న తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సునీతా రావు వ్యవహారశైలిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపారు.

Next Story