పార్టీకి నష్టం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు : బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్​రావు విమర్శించారు.

పార్టీకి నష్టం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు : బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
X
  • ఈటల పై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు
  • అందితే ఆ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం
  • అన్ని పార్టీల్లో అంతర్గత సమస్యలు ఉండటం మామూలే
  • రాజగోపాల్​రెడ్డి , కవితలతో ఆ పార్టీల్లో విబేదాలు లేవా
  • పార్టీయే సుప్రీం, వ్యక్తుల కాదు

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్​రావు విమర్శించారు. ఒకవైపు పార్లమెంటులో జరుగుతున్న అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్ అవుతున్న పరిస్థితి ఉందని మండిపడ్డారు. అలాంటి నేతలు తమ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గత 19 నెలల్లో ఢిల్లీకి 46 సార్లు వెళ్లారని ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు ఆయనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రిని కలవకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. మా పార్టీలో ఎవరికైనా క్రమశిక్షణ లేకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కొత్త –పాత అనే తేడా లేదని, ఈ తేడాలన్నీ కొంతమంది కావాలనే సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా పార్టీకి నష్టం చేసినా క్రమశిక్షణ తప్పినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని పార్టీలో అంతర్గత సమస్యలు ఉండటం సాధారణమేనని, కాంగ్రెస్​లో రాజగోపాల్​రెడ్డి, బీఆర్​ఎస్​లో కవితతో విబేధాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు ఉన్నా జాతీయ నాయకత్వం వాటిని పరిష్కరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలు. గతంలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇద్దరూ కలిసి ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కేంద్రంపై నిందలు వేయడం మానుకోవాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తే ఈ బిల్లుకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. ఆర్డినెన్స్ రాకముందే, అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం బాధాకరం. బిజెపి మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారనే అంశంపై అనుమానం కలుగుతోంది. బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 లో సవరణ చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. బీసీలను మోసం చేసినందుకు, దగా చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ అంశంలో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని వారికి తెలిసే ఉంటుందని పేర్కొన్నారు.

ఓటుబ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై బిల్లు తీసుకొచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చిందని, ఇప్పటికైనా కేంద్రంపై నిందలు వేయకుండా, 42 శాతం రిజర్వేషన్లను తాము హామీ ఇచ్చినట్టుగానే అమలు చేయాలని డిమాండ్​చేశారు. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో మాత్రం బీజేపీ స్పష్టంగా వ్యతిరేకంగా ఉంటుంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు చేస్తోంది. రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 9వ షెడ్యూల్ విషయమై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించక పోవడం బాధకరమన్నారు.

Next Story