- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నిర్వహించే 'స్వీయ ధ్రువీకరణ' (Self-Enumeration) మరియు తొలి విడత గణనపై రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి శనివారం మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. రేపటి (ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. అయితే సాంకేతికతను జోడించి ఈసారి ప్రజలే నేరుగా తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనినే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' అంటారు. ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్నా సరే, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని భారతి హోళికేరి సూచించారు. అయితే.. ఇది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదు, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.
33 ప్రశ్నలతో కూడిన గణన
జనగణనలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని డైరెక్టర్ వివరించారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు కేవలం 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 6 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను, రెండో దశలో ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి నేరుగా తెలియజేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు ఆ తర్వాత ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు తమకు వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను చూపిస్తే సరిపోతుంది. ఒక కుటుంబం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నా, లేకపోయినా, రెండో దశలో ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికీ రావడం తప్పనిసరి అని డైరెక్టర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయని వారి నుంచి ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించి ఖచ్చితమైన వివరాలను అందించాలని ఆమె కోరారు. మే 10వ తేదీ వరకు గడువు ఉన్నందున, ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.






