- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
local elections: రిజర్వేషన్లు అనుకూలించినా అయోమయం.. స్థానిక ఎన్నికల వేళ ఆశావహలకు కొత్త టెన్షన్
నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో పార్టీ నాయకత్వం అంతా అభ్యర్థులపై దృష్టి సారిస్తుంటే ఆశావహులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాజకీయ వర్గాల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana local body elections) సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు (BC reservation) సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు (High Court) పరిధిలో ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక బ్రేకులు వేస్తుందా? అనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలన్ని అభ్యర్థులపై దృష్టి సారిస్తుండగా ఆశావహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికల విషయంలో ముందుడుగు వేస్తున్న నేపథ్యంలో చివరాఖరుకు ఈ ఎన్నికలు కోర్టులో చెల్లుబాటు అవుతాయా కాదా? ఒకవేళ ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే గ్రామాల్లో ప్రజలు, ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు.
ముందడుగు వేద్దామా వద్దా?:
సాధారణంగా పొలిటికల్ కెరీర్‍లో స్థానిక సంస్థల ఎన్నికలను తొలిమెట్టుగా భావిస్తారు. క్షేత్రస్థాయిలో ఇన్నాళ్లు రాజకీయం సాగించిన వారంతా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఆశావహులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లు తమకు కలిసివచ్చినా, గెలుపుపై ఆశలు ఉన్నా.. ఈ ఎన్నికలు రాజ్యాంగబద్దం కాదని ఈ ఎన్నికలను కోర్టు కొట్టివేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఆశావహులను ఆలోచనల్లో పడేస్తున్నాయి. పోటీ చేసి గెలిచినా కోర్టు కేసు నేపథ్యంలో పదవిలో ఎంత కాలం కొనసాగుతామో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ఖర్చు తడిచి మోపెడు అవుతోంది. అసలే దసరా ముందు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఓటర్లకు చుక్కా, ముక్కతో దావత్ లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఉన్న వారితో పాటు ఉపాధి నిమిత్తం ఇతర చోట్లకు వెళ్లిన వారు గ్రామాలకు వస్తుంటారు. దీంతో రిజర్వేషన్లు ఖరారు అయిన సామాజిక వర్గంలోని ఆశావహులంతా పండగ పూట వీరందరికీ దావత్‍లు తప్పవు. నోటిఫికేషన్ రాకముందే ఖర్చులు వద్దనుకుని ఆలోచిస్తే ప్రత్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామాలకు రాని వారిని ఫోన్లు చేసి మరీ రప్పించుకోవడం, వారందరికీ మర్యాదలు అనివార్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులంతా ఇప్పుడు పోటీకి ముందడుగు వేద్దామా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. దీంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? పోటీ చేయమంటారా వద్దా అంటూ ఆశావహులు తమ సన్నిహితులు, పార్టీ నేతలతో పాటు రాజకీయంగా తమ గాడ్ ఫాదర్లు అనుకునే వారిని ఆరా తీస్తున్నారు.
తొందర పడకండి:
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆశావహులు తొందరపడవద్దని పలువురు సూచిస్తున్నారు. తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వవద్దని అనవసరంగా ఖర్చులకు పోయి ఇబ్బందులు పడవద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆశావహులకు సూచించారు. లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. బీసీలకు 42 రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతోందన్నారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






