రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Kema Shiva Kumar |

తెలంగాణలో ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు‌ చేసి, కార్డులు అందించబోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఫలితంగా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్‌, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బుల వంటి నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కిడ్నీలు దెబ్బతిని ఎంతో మంది రోగులుగా మారుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఈ నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లను ఎదుర్కొనేందుకు ప్రజా ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్‌లో సొసైటీ ఆఫ్ ద రెనల్ న్యూట్రీషన్ అండ్ మెటబాలిజం వార్షిక సదస్సును ఆరోగ్యశాఖ ప్రారంభించారు. వ్యాధి నివారణపై అవగాహన, ఎర్లీ స్టేజ్‌లోనే వ్యాధుల గుర్తింపు, ట్రీట్‌మెంట్, రిహాబిలిటేషన్ వరకూ సమగ్రంగా ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాల్లోనే‌ కీమో థెరపీ‌ అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్‌ కేన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రీజనల్ రిఫరల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష కూడా ఉందని... కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశకో గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

డయాలసిస్ సేవల కోసం ఏటా రూ.220 కోట్ల ఖర్చు..

గత సంవత్సరం 16 కొత్త డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మొత్తం సెంటర్ల సంఖ్య 102కు చేరిందని... ప్రతి రోగి 20 నుంచి 25 నిమిషాల్లో డయాలసిస్ కేంద్రానికి చేరుకునేలా లక్ష్యంగా పెట్టుకుని 416 బెడ్ల కెపాసిటీతో మరో 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో డయాలసిస్ సేవల కోసం ఏటా సర్కారు రూ.220 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. అవయవ దానంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జీవనదాన్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు వేలాది అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి, అందులో 2,700 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు ఉన్నాయన్నారు. గతేడాది తోట చట్టం అడాప్ట్ చేసుకున్నామని... ఫలితంగా గ్రాండ్ పేరెంట్స్ కూడా కిడ్నీ దానం చేసే అవకాశాన్ని కల్పించామన్నారు. బ్రెయిన్ డెత్ ధృవీకరణ విధానాన్ని సరళీకరించి అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 6 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని... వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ సనత్‌నగర్‌లో అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్ హెల్త్‌లో దేశానికి తెలంగాణను రోల్‌ మోడల్‌గా చేసుకుందామని... ఇందుకు డాక్టర్లు సహకరించాలని మా విజ్ఞప్తి చేశారు.

Next Story