- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజి‘డల్’ క్రాప్ సర్వే! క్షేత్రస్థాయిలో టెక్నికల్ సమస్యలు.. తిరస్కరణకు పంటల ఫోటోలు
వ్యవసాయ శాఖ యాప్‌లో ఫొటోలను సక్రమంగా ఆప్ లోడ్ చేయకపోతే మున్ముందు ప్రభుత్వ పథకాలు వర్తించవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంటల డిజిటల్ సర్వేకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొలాలకు సంబంధించిన చిత్రాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా లేక తిరస్కరణకు గురవుతున్నాయి. వ్యవసాయ శాఖ యాప్‌లో ఫొటోలను సక్రమంగా ఆప్ లోడ్ చేయకపోతే మున్ముందు ప్రభుత్వ పథకాలు వర్తించవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు విస్తీర్ణం నమోదు ప్రక్రియ పక్కాగా ఉండేలా డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఏఈవోలతో సర్వే చేస్తే ఆశించిన సమయంలో పూర్తి చేయడం కష్టమని 9,795 మంది వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం 1.50 కోట్ల ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను 45 రోజుల్లో సర్వే చేసేలా వ్యవసాయ శాఖ ప్లాన్ చేసింది. స్థానికంగా ఉండే కొందరు నిరుద్యోగ యువతకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చి వారి చేత సర్వే చేయిస్తున్నారు. వారంతా పది రోజులుగా తమకు అప్పగించిన గ్రామాల్లో సర్వే చేపడుతున్నారు.
ఫోటోలు తిరస్కరణ..
పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో డిజిటల్ సర్వే వేగంగా సాగుతుండగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఆయా జిల్లాల అధికారులు చెబుతున్నారు. భూములపై అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు గుర్తించని వాలంటీర్లు.. ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే అవి వ్యవసాయ శాఖ యాప్‌లోకి వెళ్లడం లేదు. వారు నమోదు చేసిన ఫోటోలు చాలా వరకు ఎల్-1 స్థాయి అధికారి ఆధ్వర్యంలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. ఏఈవోలకు చిత్రాలను ఆమోదించే అధికారం లేకపోవడం సమస్యగా మారింది. కొందరు వాలంటీర్లు రెండు నుంచి మూడు దఫాలుగా చిత్రాలు తీసి నమోదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
పంటల నమోదు తికమక..
కొందరు వాలంటీర్లు వరి పంట సాగు చేస్తే పత్తి, మొక్కజొన్న, మిర్చి సాగు చేసినట్టుగా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం కమతాల సంఖ్య పెరగడంతో ఒక్కో సర్వే నెంబర్ లో ఐదారు మంది రైతులకు చెందిన భూములు ఉన్నాయి. వాలంటీర్లు మాత్రం ఒక్క రైతుకు చెందిన సర్వే నెంబర్ వివరాలు నమోదు చేసి మిగతా వారి సర్వే నెంబర్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం వాలంటీర్లు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి పంట చిత్రం తీసి యాప్ లో నమోదు చేయాలి. ఆయా ఫోటోలకు అనుగుణంగానే వివరాలు నమోదు చేస్తున్నారా? అనే అంశాలు ఏవో పరిశీలించాలి. వివరాలు సరిగ్గా లేకపోతే తిరస్కరించాలి. మొదటిసారి తిరస్కరణకు గురైన పంట చిత్రాన్ని రెండోసారి నమోదు చేయాల్సి ఉంటుంది. పంట వివరాలను లెవెల్-2 స్థాయి అధికారిగా డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించాలి. కానీ వాలంటర్లు తీసే చిత్రాలను ఏవోలు పరిశీలించకుండా ఏఈవోలకు చూడాలని ఆదేశిస్తూ ప్రభుత్వం అప్పగించిన పని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డిజిటల్ సర్వేపై రైతుల ఆందోళన
వ్యవసాయ శాఖ చేపట్టిన డిజిటల్క్రాప్సర్వేలో తమ పంట పొలాల వివరాలు నమోదు కాకుంటే రైతుభరోసా, బీమా, ప్రకృతి విపత్తులకు పరిహారం, సబ్సిడీపై యంత్ర పరికరాలు వంటి పథకాలు రావని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పనిభారం ఏఈవోలకు అప్పగించడంతో వారు ఒక సర్వే నెంబర్పొలం వద్దకు వెళ్లి ఉప సర్వే నెంబర్లలో కూడా పంటలు వేసిన వ్యవసాయ శాఖకు నివేదికలు పంపించేవారు. ప్రస్తుతం వలంటర్లను నియమించడంతో వారు పట్టా పాస్ బుక్కలిగిన ప్రతి సర్వేలో పంట పొలాల వద్దకు వెళ్లి ఏ రకమైన పంట వేశారో చిత్రాలు చూసి యాప్‌లో నమోదు చేయాలి. వారికి టెక్నాలజీపై అవగాహన లేకపోవడంతో వారు తీసిన ఫొటోలన్నీ నమోదు కావడం లేదని విస్తరణాధికారులు చెబుతున్నారు. దీంతో నిజంగా పంటలు వేసిన రైతులు నష్టపోతారని, వలంటీర్లు చేసే విధులను ఏవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి తప్పులు జరిగితే సరిదిద్దాలని సూచనలు చేస్తున్నారు.






