- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘డిజిటల్ కేబినెట్’ విప్లవం.. ఇకపై మంత్రుల చేతుల్లో ఐ ప్యాడ్‌లు!
తెలంగాణ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే కేబినేట్ సమావేశాలన్నింటినీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్ గా నిర్వహించనున్నారు. ఐటీ విభాగం తరఫున ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరికీ ఐప్యాడ్ లు అందజేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ మీటింగ్స్ ను అమల్లోకి తీసుకువచ్చారు. ఇకపై కాగితాలతో పనిలేకుండా డిజిటల్ విధానంలో సమావేశాలు జరగనున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం..
పేపర్ విధానంలో జరిగే సమావేశాలకు ప్రతి మంత్రికి కేబినెట్ ఎజెండా ను సర్క్యులేట్ చేయడానికి సమయం పడుతున్నది. అతి తక్కువ సమయం ఉంటుండడంతో కేబినెట్ ఎజెండాను సమీక్షించుకోవడానికి వీలు కావడం లేదు. కేబినెట్ నిర్ణయాలను ట్రాక్ చేయడం , ఫాలో అప్ చేయడం కష్టతరంగా మారింది. నిర్ణయాల పురోగతిపై రియల్ టైం విజిబిలిటి లేకపోవడం మరొక ప్రధాన సమస్యగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని 2025 జూన్ 23నాటి కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఐటీ, ఎన్ఐసీ విభాగాలకు అమలు బాధ్యతలను అప్పగించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో డిజిటల్ కేబినెట్ లను అమలు చేస్తున్నారని గుర్తించారు. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు డిజిటల్ కేబినెట్ అమలు చేస్తున్న వాటిల్లో ఉన్నాయి. అక్కడ విజయవంతంగా డిజిటల్ విధానంలో కేబినెట్ను అమలు చేస్తున్నారని రాష్ట్ర అధికారులు గుర్తించారు.
ఈ-బుక్ రూపంలో ఎజెండా
డిజిటల్ కేబినెట్లో కాగితాలకు స్థానంలో డిజిటల్ ఎజెండాను ఈ–బుక్ రూపంలో అందిస్తారు. ఇందులో సులభంగా నావిగేట్ చేయవచ్చు. అవసరమైన అంశాలను వెతకవచ్చు. డిజిటల్గానే వ్యాఖ్యలను మంత్రులు రాయవచ్చు. సీఎం సహా మంత్రులు లాగిన్ అయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సమావేశంలో పాల్గొనవచ్చు. సమావేశం నోటీసులు, ఎజెండా వివరాలు నేరుగా ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా అందుతాయి. కేబినెట్ సమావేశం జరిగే రోజున ఎజెండాను ప్రత్యక్షంగా నిర్వహించడానికి విధానం తొడ్పతుంది. ఆయా శాఖలు మంత్రివర్గ ఎజెండా అంశాలను జీఏడీకి పంపిస్తారు. అక్కడ వారు అన్ని శాఖల అంశాలను కలిపి డిజిటల్ విధానంలో ఎజెండా క్రమపద్ధతిలో తయారు చేస్తారు. ఆ తరువాత ఈ–బుక్ రూపంలో పంపిస్తారు. తర్వాత మంత్రులు, కార్యదర్శులకు పంపిస్తారు. కేబినెట్ హాల్ లోని స్క్రిన్పై ప్రస్తుతం చర్చలో ఉన్న అంశం వివరాలు కనిపిస్తాయి. బయట వెయిటింగ్ హాల్లో ఉన్న కార్యదర్శులకు తదుపరి రాబోయే అంశం తెలుస్తుంది. వారి తమ ఎజెండా కోసం సిద్ధంగా ఉండొచ్చు. ఎజెండా గోప్యతను కాపాడేందుకు జీఏడీ కేబినెట్ విభాగానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన ఐసోలేటెడ్ నెట్ వర్క్లో దీనిని రన్ చేస్తారు.






