ఎన్నికల వేళ కేసీఆర్‌కి కొత్త తలనొప్పి.. ఇలాగే కంటిన్యూ అవుతే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే!

by Disha Web |
ఎన్నికల వేళ కేసీఆర్‌కి కొత్త తలనొప్పి.. ఇలాగే కంటిన్యూ అవుతే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలో మున్సిపల్ చైర్మన్ 'గిరి' అలజడి సృష్టిస్తున్నది. నాలుగేళ్ల తర్వాతనే అవిశ్వాసం పెట్టాలనే బిల్లు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉండగా, ఇది ప్రస్తుతం ఎమ్మెల్యేలకు అస్త్రంగా మారింది. స్థానిక ఎమ్మెల్యేలే పార్టీలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మున్సిపాలిటీలపై ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయించేందుకే వ్యతిరేకవర్గానికి సపోర్ట్ చేస్తున్నారని సొంతపార్టీ నేతలే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇది కాస్త రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపనుందనేది విశ్లేషకుల టాక్. కొంతకాలంగా ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే వర్సెస్ నగర మేయర్ వ్యవహారం నడుస్తున్నది. గత నెల 26 వతేదీతో రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మూడేళ్ల పదవీకాలం ముగిసింది. దీంతో ఎమ్మెల్యేలు పంతం నెగ్గించుకునేందుకు గ్రూపు పాలిటిక్స్ మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు చైర్మన్ ఎన్నిక సమయంలో రెండేళ్లు, రెండున్నరేళ్లుగా ఒప్పందం చేసుకొని పదవిని చేపట్టారు.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను కొందరు చైర్మన్లు పెడవిన పెడుతున్నారనే కారణంగా సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో శనివారం ఒక్కరోజే జవహర్ నగర్, పెద్ద అంబర్ పేట్, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో కొంతమంది కౌన్సిలర్లు చైర్మన్లపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన ప్రతులను మున్సిపల్ కమిషనర్లతో పాటు కలెక్టర్లకు అందజేశారు. అందకుముందు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి రిజైన్ చేశారు. జనగాం మున్సిపాలిటీలో సైతం క్యాంపు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇలా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమ అనుచరులను చైర్మన్ గా, మేయర్ లుగా నియమించేందుకు ఇప్పటికే కలెక్టర్లకు సైతం ఆదేశాలిచ్చినట్టు.. ఇక కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేస్తే వెంటనే ఆమోదించాలని కూడా సూచించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే ఆధిపత్యం పోతుందనే..

భవిష్యత్ లో చైర్మన్, మేయర్ తో ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సెగ్మెంట్ లో సెకండ్ నేతగా ఎదిగి అసెంబ్లీ టికెట్ కు పోటీ వస్తారనే భయం నెలకొన్నట్టు సమాచారం. అందుకే చైర్మన్ కు గుర్తింపు రాకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కౌన్సిల్ మీటింగ్ లోనూ ఎమ్మెల్యే ఇచ్చిన స్ర్కిప్టును మాత్రమే చదవాలని ఆశిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రులు, కేటీఆర్, కవితలను సైతం కలవద్దనే రూల్స్ కూడా విధిస్తున్నారు. మున్సిపాలిటీల్లో చేపట్టే పనులను ఎమ్మెల్యే అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సొంతంగా చేస్తే వారిని టార్గెట్ చేస్తూ మరోవర్గంతో ఒత్తిడి పెంచుతుండడమే కాదు.. అవిశ్వాస తీర్మానానికి తెరదీస్తున్నారు. వార్డుల సందర్శనకు వెళ్లినా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలనే రూల్ పెడుతుండగా.. చైర్మన్లు విసుగుచెందడంతో మరోవేదనకు గురవుతున్నామని ఓ మున్సిపల్ చైర్మన్ వెల్లడించారు. మున్సిపల్ పరిధిలో సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సొంతపార్టీ చైర్మన్లపైనే ఎమ్మెల్యేలు వ్యహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలే టార్గెట్?

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండగా.. మున్సిపాలిటీల్లో మూడేళ్ల పదవీకాలం ముగియడంతో అసమ్మతి రాగం తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు ఎక్కువగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన చైర్మన్లనే టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెప్పిన మాటవినకపోతే వెంటనే అసమ్మతి గ్రూపు తయారు చేయించి సమావేశాల్లో అడ్డుకునే ప్రయత్నాలు, నిధుల విషయంలో గొడవలకు ఎమ్మెల్యేలే ప్రేరేపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి వసంత(ఎస్సీ) కావడంతోనే వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అస్త్రంగా మారిన 'మూడేళ్లు'

చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ లపై నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా పురపాలక చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13, 2022న శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రస్తుతం 3 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా ఉంది. దీన్ని నాలుగేళ్లకు పెంచేలా ప్రతిపాదన చేశారు. కానీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. దీనిని అస్త్రంగా చేసుకున్న ఎమ్మెల్యేలు చైర్మన్లపై అవిశ్వాసానికి తెరలేపారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాబోయే ఎన్నికల్లో వర్గ పోరు ఎఫెక్ట్

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే గడువు ఉండగా, మున్సిపాలిటీలో అవిశ్వాసానికి తీర్మానాలు స్టార్ట్ అయ్యాయి. వీటికి సూత్రధారులు ఎమ్మెల్యేలే అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అధికార బీఆర్ఎస్ కు గడ్డుకాలమే ఏర్పడింది. ఇక వేళ తీర్మానాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చైర్మన్ లుగా కొనసాగిన వారంతా ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో వ్యతిరేకత మరింత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గంలో ఓడిపోయే అవకాశం సైతం ఉందని పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.

Also Read..

నేటి నుంచి TPCC చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర.. కాంగ్రెస్‌లో జోష్ తెచ్చేనా..?Next Story