HYD: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి చర్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

HYD: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా పీఎం-ఈ డ్రైవ్ కింద 9 నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోదని... అందులో హైదరాబాద్ కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్ లో ఎదురయ్యే సవాళ్లు, మౌలిక సదుపాయాలపై స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి శుక్రవారం సెక్రటేరియట్ లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు సబ్సిడీ కింద రూ.35 లక్షలు కేటాయిస్తుందని మంత్రి తెలిపారు.

ఈ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఈవీల ఆపరేషన్ లో రాష్ట్రానికి కావల్సిన మౌలిక సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, టెక్నికల్ ఆపరేషన్స్ పై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి 2వీలర్స్ 3వీలర్స్ , 4వీలర్స్, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. 2019 మార్చిలో 40 యూనిట్లతో దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. 2023 సేకరణ ప్రణాళిక కింద 1010 అదనపు ఎలక్ట్రిక్ బస్సులను (510 ఇంటర్‌సిటీ, 500 సిటీ బస్సులు) చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే లెటర్స్ ఆఫ్ అవార్డును జారీ చేసింది. ప్రస్తుతం 775 ఎలక్ట్రిక్ బస్సులు (510 ఇంటర్‌సిటీ మరియు 265 సిటీ బస్సులు) నడుస్తున్నాయి. మిగిలిన 275 మార్చి 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు వెల్లడించారు.

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ఈవీ కంపెనీల జాప్యం..

ఈవీ రంగంలోని రెండు స్థానిక కంపెనీలతో ఆర్టీసీకి ఆపరేటింగ్ అనుభవం లభించిందని మంత్రి తెలిపారు. కొంతమంది ఆపరేటర్లు టెండర్ షరతులను పాటించకపోవడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ బస్ డెలివరీలలో అసాధారణ జాప్యంతో పాటు బ్రేక్‌డౌన్ ఫ్రీక్వెన్సీ పరంగా ఈవీల పనితీరు తక్కువగా ఉండటం ఇబ్బందికరంగా మారిందన్నారు. డీజిల్ బస్సులతో పోలిస్తే సర్వీస్ రద్దు, ప్రమాద రేటు ఎక్కువ నమోదు లాంటివి జరుగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు సజావుగా నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.

పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన డిపోలలో హై-టెన్షన్ (హెచ్టీ) విద్యుత్ కనెక్షన్‌లను సకాలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సకాలంకో బస్సుల డెలివరీతో పాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీలను కోరారు. సమర్థవంతమైన సేవల కోసం అర్హత కలిగిన డ్రైవర్లు, సాంకేతిక నిపుణులను నియమించాలన్నారు. విశ్వసనీయత, సేవలు అందించడంలో డీజిల్ బస్సులతో సమానమైన పనితీరు స్థాయికి చేరుకునాలని ఈవీ కంపెనీలకు సూచించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ అధికారులు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story