అది SBI భూమి అని తెలీదా..? TGIIC భూవేలంపై హైకోర్టు ధర్మాసనం ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-18 10:52:39  IST  )

రాయదుర్గం టీజీఐఐసీ (TGIIC) భూముల వేలంపై తెలంగాణ హైకోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి.

అది SBI భూమి అని తెలీదా..? TGIIC భూవేలంపై హైకోర్టు ధర్మాసనం ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ కారిడార్‌ పరిధిలోని రాయదుర్గంలో ఉన్న టీజీఐఐసీ (TGIIC) భూముల వేలం వ్యవహారం తెలంగాణ హైకోర్టులో హాట్ టాపిక్‌గా మారింది. వేలం వేసిన భూమి తమదేనంటూ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు హాల్‌లో ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు చోటుచేసుకున్నాయి.

16 ఏళ్లు గడిచినా నిర్మాణమే లేదు.. ఏఏజీ వాదనలు

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) ధర్మాసనం ఎదుట గట్టిగా వాదనలు వినిపించారు. ‘2010లోనే రాయదుర్గంలోని సదరు భూమికి సంబంధించి అప్పటి టీజీఐఐసీతో ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండేళ్ల కాలపరిమితిలోనే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఒప్పందం జరిగి దాదాపు 16 ఏళ్లు గడిచినా ఎస్బీఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదు’ అని ఏఏజీ కోర్టుకు విన్నవించారు. నిబంధనల ఉల్లంఘన వల్లే ఆ భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.(

‘రియల్’ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా?

ఏఏజీ వాదనలపై స్పందించిన గౌరవ న్యాయమూర్తి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ‘అసలు ఏ కారణంతో ఆ భూమిని వేలం వేశారు? అది ఎస్బీఐకి కేటాయించిన భూమి అని మీకు తెలీదా.. ఓ ప్రభుత్వ సంస్థ భూమిని ఇలా ఎలా వేలం వేస్తారు?" అని ఏఏజీని నిలదీశారు. అంతేకాకుండా, ‘ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో స్థిరాస్తి (Real Estate) వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా?’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలపై ఏఏజీ కలుగజేసుకుంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. రాయదుర్గంలో అత్యంత విలువైన ఎస్బీఐ భూములను టీజీఐఐసీ వేలం వేయడంపై హైకోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతుండటంతో, ఈ వివాదం ఎలాంటి ముగింపునకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story