బెంగాల్‌లో దీదీ కోట బద్దలు.. ‘‘నెక్స్ట్ తెలంగాణ’’ అంటూ టీ బీజేపీ సంచలన ట్వీట్!

by Ramesh Naini |

గతంలో బెంగాల్ బీజేపీ చేసిన ట్వీట్‌ను కోట్ చేస్తూ, తెలంగాణ బీజేపీ తమ అధికారిక ఖాతాలో ‘నెక్స్ట్ తెలంగాణ ’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

బెంగాల్‌లో దీదీ కోట బద్దలు.. ‘‘నెక్స్ట్ తెలంగాణ’’ అంటూ టీ బీజేపీ సంచలన ట్వీట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2025లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ 202 స్థానాల్లో గెలుపొంది ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించింది. ఆ డబుల్ సెంచరీ ఉత్సాహంలో ‘నెక్స్ట్ పశ్చిమ బెంగాల్’ అంటూ అప్పట్లో బెంగాల్ బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఆనాటి అంచనాలను నిజం చేస్తూ.. తాజా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో.. ఏకంగా 15 ఏళ్ల మమతా బెనర్జీ (టీఎంసీ) కంచుకోటను బద్దలు కొడుతూ కమలనాథులు రాజకీయ వర్గాలకు గట్టి షాక్ ఇచ్చారు. గత రెండు దఫాలుగా సాధ్యంకాని విజయాన్ని బెంగాల్‌లో బీజేపీ సొంతం చేసుకుంటున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. గతంలో బెంగాల్ బీజేపీ చేసిన ట్వీట్‌ను కోట్ చేస్తూ, తెలంగాణ బీజేపీ తమ అధికారిక ఖాతాలో ‘నెక్స్ట్ తెలంగాణ (Next 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚)’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అంతేకాకుండా, దీనిని తమ అకౌంట్లో పిన్ ట్వీట్‌గా ఉంచడంతో ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వార్..

టీ-బీజేపీ చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తెలంగాణలో తదుపరి సర్కారు తమదేనని, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ మద్దతుదారులు కామెంట్ల వర్షం కురిపిస్తుండగా.. ఇతర పార్టీల మద్దతుదారులు కౌంటర్లు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారమని, కేసీఆర్‌ను దాటుకుని బీజేపీ పీఠం ఎక్కడం అంత సులువు కాదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ట్వీట్లు వేయడం ఈజీ.. కానీ క్షేత్రస్థాయిలో గెలవడం కష్టం’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

దక్షిణాదిపై కమలం గురి..

దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటూ ‘మోడీ మయం’గా మారుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, మిజోరం రాష్ట్రాలు మినహా మిగతా అన్ని చోట్ల ఎన్డీయే చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుండగా.. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తాజా ట్వీట్‌తో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది.

Next Story