రాజకీయాల్లోకి ధనుష్!.. రజనీకాంత్ వదిలేసిన ఆధ్యాత్మిక రాజకీయాన్ని కొనసాగించబోతున్నారా?

by Prasad Jukanti |   (  Updated:2026-07-27 11:14:49  IST  )

అభిమానుల సమావేశంలో నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లోకి ధనుష్!.. రజనీకాంత్ వదిలేసిన ఆధ్యాత్మిక రాజకీయాన్ని కొనసాగించబోతున్నారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సినీ తారల పొలిటకల్ ఎంట్రీ మరోసారి ట్రెండ్‍గా మారుతోంది. ఇప్పటికే అనేక మంది సినిమా నటులు రాజకీయాల్లో చక్రం తిప్పగా ఇటీవలే టీవీకే చిఫ్ విజయ్ దళపతి ఏకంగా రాజకీయాల్లో తన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇదే స్ఫూర్తితో తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఆయన పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నారంటూ కోలీవుడ్‍తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

అభిమానుతో పొలిటికల్ టచ్ స్పీచ్:

ఇటీవల తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ చేసిన వ్యాఖ్యలు తాను రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిర్వహించిన రక్తాదాన శిబిరంలో ధనుష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. తన అభిమానులు అంతా ఒకే తాటిపైకి రావాలని, ఇకపై కేవలం సినిమాల వేడుకలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మీ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకొని, వారికి సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడేలా చేస్తారని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ సమావేశం సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ తమ అధికారిక జెండాను సైతం ఆవిష్కరించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక శివభక్తుడైన ధనుష్ తన ప్రసంగాన్ని 'ఓం నమశ్శివాయ' అని ముగించడం ద్వారా ఆధ్యాత్మిక రాజకీయాన్ని కొనసాగించబోతున్నాననే హింట్ ఇచ్చారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నేషనల్ అవార్డుపై..

మరోవైపు 72వ జాతీయ చలన చిత్ర అవార్డులపై కూడా ధనుష్ స్పందించారు. తాను స్వీయ దర్శకత్వం వహించిన రాయన్ చిత్రానికి నేషనల్ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శళపై స్పందిస్తూ. రాయన్ చిత్రానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ ఏడాది రాయన్ కంటే మంచి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల అభిమానులు తమ ప్రేమాభిమానాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నేను వారిని పూర్తిగా గౌరవిస్తాని అని పేర్కొన్నారు. గతంలో ఎన్నో మంచిచిత్రాలు చేశాను వాటికి అవార్డులు వస్తాయని భావించినా రాలేదంటూ ఓపెన్ అయ్యారు.

రజనీకాంత్ వ్యూహమేనా?

తన పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ స్వయంగా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఆయన మాటతీరు, వైఖరిని బట్టి తమిళనాడులో మరో సరికొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో తమిళనాడులో నీతి, నిజాయితీ, పారదర్శకతతో పాటు ఆధ్యాత్మిక రాజకీయాలు నడపాలని కోరుకుంటున్నట్లు రజనీకాంత్ పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ధనూష్ తన ప్రసంగం చివర్లో ఓం నమశ్శివాయ అని చెప్పడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో చెప్పిన 'ఆధ్యాత్మిక రాజకీయాన్ని' (Spiritual Politics) ధనుష్ అందుకోబోతున్నారా? రజనీకాంత్ గత రాజకీయ వ్యూహాన్నే ధనూష్ మొదలుపెట్టబోతున్నారా? లేక తమిళనాడులో బీజేపీకి ఫేస్‌గా మారతారా? అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేది కాకుండా టీవీకే విజయ్ ఓట్లను చీల్చేందుకు వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రచారమా? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై డీఎంకే స్పందిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకునే ఎవరికైనా స్వాగతం పలుకుతామని స్పష్టం చేసింది. ఇక తాను గెలిచిన రెండో స్థానానికి తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేయడంతో త్వరలో తిరుచ్చి ఈస్ట్ కు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారం తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Next Story