- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది మొక్కుబడి కార్యక్రమం కాదు: డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. వాహనాల సంఖ్య పెరగడం, అతి వేగంతో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారాలను కనుగోనాలని సీఎస్ ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం అమలుపై సీఎస్.. గురువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తక్షణమే నిర్వహించి, వారాంతర అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని ఉంటుందని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజల ప్రాణాలను రక్షించడానికి, రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత రహదారులను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని సీఎస్ పేర్కొన్నారు.
ఇది మొక్కుబడి కార్యక్రమం కాదు: డీజీపీ శివధర్ రెడ్డి
ఈ కార్యక్రమం సాధారణంగా నిర్వహించే మొక్కబడి కార్యక్రమం కాదని, ఇది పలు శాఖల సమన్వయంతో కూడిన సమగ్ర చర్య అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రోడ్డు భద్రత చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు కూడా తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంక, జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు.
అలైవ్- అరైవ్ కార్యక్రమ షెడ్యూల్...
ఏప్రిల్ 13: గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు.
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రమాణం చేయించడం.
ఏప్రిల్ 15: చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ డే- నాలుగేళ్లకు పైబడిన పిల్లలకు సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు.
ఏప్రిల్ 16: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు- హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, సోషల్ మీడియాలో అవగాహన సందేశాలు, ఫొటోలు పంచుకోవడం.
ఏప్రిల్ 17: ప్రమాదాల అనంతరం తక్షణ సహాయం మెరుగుపరచడానికి గోల్డెన్ అవర్ అత్యవసర స్పందన శిక్షణ కార్యక్రమాలు.
ఏప్రిల్ 18: ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు- ప్రవర్తనా మార్పు, ట్రాఫిక్ నియమాల పాటించడంపై దృష్టి.






