డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. మధ్యంతర పిటిషన్ కొట్టివేత

by Ramesh Naini |

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. మధ్యంతర పిటిషన్ కొట్టివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, డీజీపీ శివధర్ రెడ్డికి ఊరటనిచ్చింది. అదే సమయంలో రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఐదుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపినట్లు, స్పష్టీకరణ కోసం యూపీఎస్సీ ఆ జాబితాను తిరిగి పంపినట్లు కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31న మరోసారి జాబితాను పంపామని, అయితే సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిరిగి పంపిందని ఏజీ తెలిపారు.

ఆ జాబితాను పరిగణనలోకి తీసుకునే విధంగా యూపీఎస్సీని ఆదేశించాలని హైకోర్టు ధర్మాసనాన్ని ఏజీ కోరారు. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందే యూపీఎస్సీకి ప్యానెల్ పంపాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు.

Next Story