క్రిమినల్ గ్యాంగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీజీపీ డా. జితేందర్

by Ajay Maddhiboyina |

తెలంగాణలో పెరుగుతున్న క్రిమినల్ గ్యాంగ్‌ల నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డా. జితేందర్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

క్రిమినల్ గ్యాంగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: డీజీపీ డా. జితేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పెరుగుతున్న క్రిమినల్ గ్యాంగ్‌ల నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డా. జితేందర్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. తొలి అర్థ వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రిమినల్ గ్యాంగ్‌లను అరికట్టేందుకు ఉన్న కఠిన చట్టాలను సమర్థంగా ఉపయోగించాలని సూచించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సీఐడీ అదనపు డీజీపీ చారుసిన్హా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా క్రిమినల్ గ్యాంగ్‌ల సభ్యులు జైలు శిక్షలు అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. అందుకే, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తమ పరిధిలోని క్రిమినల్ గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు:

మరోవైపు, తెలంగాణలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అరికట్టాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. యువత డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వాడకంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, కఠిన నిబంధనలను అమలు చేయాలని సూచించారు. డ్రగ్స్ ఎక్కడి నుండి రాష్ట్రానికి వస్తున్నాయో తెలుసుకోవడానికి సరఫరా మార్గాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో టీ-నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను అరెస్ట్ చేశామని చెప్పారు. అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ, పార్థీ గ్యాంగ్‌ల తరహాలో చెడ్డీ, భవేరియా వంటి గ్యాంగ్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని తెలిపారు. శాంతిభద్రతల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీఎన్ఎస్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ పిల్లల, మహిళల ల కోసం చేపడుతున్న మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ల ప్రాధాన్యతలను తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కృపా ల సింగ్ దర్యాప్తు లో కీలకమైన ఫోరెన్సిక్ అంశాల గురించి వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీలు మహేశ్ ఎం భగవత్, వి వి శ్రీనివాస రావు, స్వాతి లక్రా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర, డీజీ ప్రిజన్స్ సౌమ్య మిశ్రా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Next Story