- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.. రాష్ట్ర పోలీసులకు DGP సూచన
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పోలీస్ ర్యాంకింగ్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించిందని.. తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పోలీస్ ర్యాంకింగ్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించిందని.. తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుండి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో జితేందర్ తన కార్యాలయంలో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సివిల్ సర్వీసెస్‌కు సెలక్ట్ అయిన తర్వాత ఏ సర్వీస్ ఎంపిక చేసుకోవాలని పలువురితో చర్చించానని చాలామంది ఐపీఎస్ ఎంపిక పట్ల విముఖత కనబరిచారన్నారు.
కానీ 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దేశంలోనే ప్రథమ స్థానం పొందిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని మధ్య సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ పనితీరు, విధానాలను పరిశీలించి మన పోలీస్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, తదితర 32 ప్రామాణికాలను బేరీజు వేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానాన్ని పొందామన్నారు. ఈ గౌరవాన్ని నిలుపుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత సమర్థంగా, జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖకు దక్కిన ప్రధాన స్థానాన్ని నిలుపుకోవాలంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరు మెరుగుపడాలనీ, బాధితులకు న్యాయం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఎస్‌హెచ్‌ఓలు పనిచేయాలని, ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం ఉన్నదన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని, బాధితులకు న్యాయం జరగనప్పుడు పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఎస్‌హెచ్‌ఓల పనితీరు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో క్యూఆర్ కోడ్ పద్దతిని ప్రవేశపెట్టామని, దాని ద్వారా పనితీరును తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. తమ పనితీరును కుటుంబ సభ్యులను, చుట్టూ ఉన్నవారి నుండి తెలుసుకోవచ్చని అన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం ద్వారా ఉత్తమ పోలీస్ అధికారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని డీజీపీ డాక్టర్ జితేందర్ సూచించారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. కింది స్థాయిలో పోలీస్ సిబ్బంది తప్పులు చేస్తే ఉన్నతాధికారులు న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలలో, పోలీస్ స్టేషన్ల సిబ్బందిలో మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా వేతనాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడవద్దని తద్వారా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని స్పష్టం చేశారు. ఏఐజీ రమణ కుమార్, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






