- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక డ్రగ్స్, సైబర్ నేరాలే టార్గెట్ : డీజీపీ సీవీ ఆనంద్
పోలీస్ శాఖలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు డీజీపీ సీవీ ఆనంద్ నడుం బిగించారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

- డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం లో గ్రేహౌండ్స్, ఎస్ఐబీ
- ట్రాఫిక్, కల్తీ ఆహారం, విజిలెన్స్ కోసం త్వరలో సరికొత్త విభాగాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీస్ శాఖలో జవాబుదారీతనం, పారదర్శకత, నెలకొల్పడమే లక్ష్యంగా.. మారుతున్న సామాజిక పరిస్థితులు, సరికొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ పనితీరులో మార్పు రావాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, కమాండెంట్లు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం పైనే గ్రేహౌండ్స్, ఎస్ఐబీల పూర్తిస్థాయి దృష్టి
గడిచిన మూడు దశాబ్దాలుగా నక్సలిజం అణచివేతపైనే రాష్ట్ర పోలీస్ ప్రధానంగా దృష్టి సారించిందని డీజీపీ గుర్తుచేశారు. గత 15 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావం దాదాపుగా కనుమరుగైనందున.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్ఐడి వంటి ప్రత్యేక విభాగాల ప్రాధాన్యతను పునఃసమీక్షించి, డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం పైనే ఇకపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంది అన్నారు.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టి, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, కల్తీ ఆహారాన్ని అడ్డుకునేందుకు ఫుడ్ అడల్టరేషన్ వింగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను పకడ్బందీగా ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
షీ టీమ్స్‌ను మరింత బలోపేతం
మహిళలు, బాలల భద్రత, అక్రమ రవాణా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేకుండా భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్ఎస్ 2.0 సాఫ్ట్‌వేర్ పనితీరు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అమలు సరిగా లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, టెక్ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీఐడీ డీజీ, టెక్నికల్ సర్వీసెస్ డీజీల నేతృత్వంలో యువ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక డీజీపీ టెక్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు హాక్ ఐ అల్ట్రా, టీజీ కాప్ అల్ట్రా వంటి అప్లికేషన్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
ప్రజల కోసం ప్రతిరోజూ 2 గంటలు
విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అవినీతి, పద్ధతులు పాటించకపోవడం వంటి ధోరణులను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. కిందిస్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ పైఅధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని, తోటి సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు కేవలం పర్యవేక్షకులుగా కాకుండా నిజమైన నాయకులుగా సిబ్బందిని ముందుండి నడిపించాలని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి యూనిట్ కార్యాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదుదారుల కోసం తప్పనిసరిగా సమయం కేటాయించాలని ఆదేశించారు. జిల్లాల్లో అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, వారికి మార్గనిర్దేశం చేసేందుకు నలుగురు ప్రత్యేక డీఐజీలను నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 15వ తేదీలోపు క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి, ఆ నివేదికలను అదే నెల 20 లోపు డీజీపీ కార్యాలయానికి, సీఐడీకి పంపాలని సూచించారు. యూనిట్ అధికారులు నెలకు కనీసం రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి స్పష్టం చేశారు.
రూ.6 వేల కోట్ల సిబ్బంది బకాయిల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఏళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.6,000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బకాయిల విడుదలకు ఇటీవలే ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు సఫలమయ్యాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2,000 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ.4,000 కోట్లను రాబోయే 100 రోజుల్లో విడతల వారీగా చెల్లిస్తారని, సిబ్బంది ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం లో డీజీలు మహేష్ ఎం.భగవత్, వి.వి.శ్రీనివాసరావు, చారు సిన్హా, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు, గజరావ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.






