- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలపై క్షేత్రస్థాయిలో డీజీపీ పర్యటన
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ శనివారం నగరంలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

- మల్కంచెరువు, టోలిచౌకి తదితర ముంపు ప్రాంతాల్లో పరిశీలన
- రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం హై అలర్ట్ లో ఉండాలి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సి.వి. ఆనంద్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డీజీపీ సి.వి. ఆనంద్ శనివారం నగరంలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.ముంపునకు గురైన ప్రాంతాలను, ట్రాఫిక్ అంతరాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులందరూ హై అలర్ట్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
నగరంలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్న మల్కంచెరువు, టోలిచౌకి తదితర పరిసర ప్రాంతాల్లో డీజీపీ ఆనంద్ పర్యటించారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌తో కలిసి అక్కడి పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే లోతట్టు, సున్నితమైన ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలని, రద్దీగా ఉండే కీలకమైన కూడళ్ల వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రించాలని సూచించారు.
అన్ని జిల్లాల పోలీసులకూ అలర్ట్..
వర్షాల ప్రభావం ఉన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులను డీజీపీ అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక విపత్తు స్పందన దళాలు, మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. వరదల్లో చిక్కుకున్న లేదా కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విభాగాలు వేరైనా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా ప్రజలకు డీజీపీ సి.వి. ఆనంద్ కీలక విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో తీవ్ర జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని కోరారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల భద్రత, సాఫీగా ట్రాఫిక్ నిర్వహణ, తక్షణ అత్యవసర స్పందన కోసం తెలంగాణ పోలీస్ శాఖ అంకితభావంతో పనిచేస్తోందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు.






