- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్‌ఆర్ పై నిబంధనల అమలులో కఠినంగా ఉండండి : డీజీపీ సీవీ ఆనంద్
ఓఆర్ఆర్‌పై ప్రమాదాల నివారణకు డీజీపీ సీవీ ఆనంద్ కఠిన ట్రాఫిక్ చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.

దిశ,తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు పై ఇటీవల వరుసగా సంభవిస్తున్న ఘోర ప్రమాదాల పట్ల ప్రాణనష్టాన్ని నివారించేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ శనివారం ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతో పాటు భద్రతా ప్రమాణాల అమలులో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని డీజీపీ సూచించారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ను ఏర్పాటు చేయనుందని ఆయన వెల్లడించారు. ఈ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోందని, ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలే కాకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని, నిబంధనల అమలులో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందన దీప్తితో పాటు ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






