పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు

by Ramesh Naini |

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ సోమవారం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ సోమవారం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధి నిర్వహణలో పారదర్శకత, కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా ఆయన మూడు గంటల పాటు కార్యాలయంలోని అన్ని విభాగాలను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కార్యాలయ పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, సిబ్బంది తమ విధి నిర్వహణలో మరింత సమర్థతను చాటాలని సీవీ ఆనంద్ ఆదేశించారు. ఆఫీసుల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా గోడలు, అల్మారాలు,టేబుళ్లకు అన్ని చోట్లా ఒకే విధమైన రంగులు ఉండేలా పెయింటింగ్ వేయించాలని సూచించారు. కార్యాలయాల్లో ఎక్కడపడితే అక్కడ ఫైళ్లను గుట్టలుగా ఉంచడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఫైళ్లను వెంటనే క్రమపద్ధతిలో రికార్డు రూమ్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ హాల్స్‌తో సహా ఇతర గదులను మరింత విశాలంగా, అత్యాధునికంగా మార్చేందుకు వీలుగా రీ డిజైనింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీజీపీ వెంట డీజీలు మహేష్ భగవత్ లా అండ్ ఆర్డర్, స్వాతి లక్రా ఆర్గనైజేషన్, హోంగార్డ్స్, వి.వి. శ్రీనివాసరావు టెక్నికల్ సర్వీసెస్, చారు సిన్హా సీఐడీ, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story