రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణే మా మొదటి ప్రాధాన్యత: డీజీపీ సీవీ ఆనంద్‌

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ముందున్న లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్వహించిన మొట్టమొదటి అధికారిక సమీక్షా సమావేశానికి డ్రగ్స్ అంశాన్నే ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో సంకేతాలిచ్చారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణే మా మొదటి ప్రాధాన్యత: డీజీపీ సీవీ ఆనంద్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ముందున్న లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్వహించిన మొట్టమొదటి అధికారిక సమీక్షా సమావేశానికి డ్రగ్స్ అంశాన్నే ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో సంకేతాలిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఈగల్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రధాన కార్యాలయంలో ఆ విభాగం పనితీరును సుమారు మూడు గంటల పాటు సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డ్రగ్స్ నిర్మూలనపై స్పష్టమైన ఆదేశాలిచ్చారని, యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న ఈ మహమ్మారిని అంతం చేసే ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.

గ్రేహౌండ్స్‌ తరహాలో వ్యూహరచన....

గతంలో రాష్ట్రంలో నక్సలైట్లను అరికట్టేందుకు గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి ఏజెన్సీలు ఎలాగైతే పనిచేశాయో, నేడు డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించేందుకు ఈగల్ ఫోర్స్ అదే తరహాలో ఒక ఎలైట్ యాక్షన్ గ్రూప్‌గా పనిచేయాలని అన్నారు తాను కేంద్ర సర్వీసులో విమానాశ్రయాల భద్రతా ఇంచార్జిగా ఉన్నప్పుడు ఈ సమస్య తీవ్రతను గమనించానన్నారు. కేవలం ఒక బ్యూరో ఏర్పాటుతో సరిపోదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా సమన్వయంతో కదలాలని, అందుకే నాటి ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఈ అంశాన్ని పట్టుబట్టి చేర్పించినట్లు గుర్తుచేశారు. డ్రగ్స్‌తో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలపై కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అరెస్టుల్లో రికార్డు.. 93 మంది విదేశీయులను డిపోర్ట్..

రాష్ట్రంలో గత మూడేళ్లలో డ్రగ్స్ కేసుల నమోదు గణనీయంగా పెరగడం పోలీసుల పకడ్బందీ నిఘాకు నిదర్శనమని డీజీపీ వివరించారు. 2023లో 1,464 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 2,734కు చేరింది. అరెస్టుల సంఖ్య కూడా 3,157 నుండి 5,703కు పెరిగింది. జాతీయ స్థాయిలో ప్రతి కేసులో సగటున 1.3 మంది అరెస్టవుతుంటే, తెలంగాణలో అది 3.1గా ఉండటం విశేషం. అంటే కేవలం చిరు వ్యాపారులనే కాకుండా, వారి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను కూడా పట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా నిందితుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68 ఎఫ్ కింద ఇప్పటివరకు 386 ఫ్రీజింగ్ మెమోలు జారీ చేశామన్నారు. కోట్లాది రూపాయల విలువైన అక్రమ ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోందని, అంతర్జాతీయ నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌ను, హవాలా నెట్‌వర్క్‌లను చేధించామని వెల్లడించారు. కొరియర్ సంస్థల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి, ఇప్పటివరకు 93 మంది విదేశీయులను డిపోర్ట్ చేసినట్లు అధికారులు డీజీపీకి వివరించారు.

విద్యాసంస్థల బాధ్యత..నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు..

డ్రగ్స్ విషయంలో విద్యాసంస్థలు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని డీజీపీ హెచ్చరించారు. తమ సంస్థకు చెడ్డ పేరు వస్తుందనే భావనతో సమాచారాన్ని దాచిపెడితే యాజమాన్యాలపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 4500 యాంటీ డ్రగ్ కమిటీల లక్ష్యం నెరవేరడం లేదని, ఇకపై డ్రగ్స్‌తో పాటు ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మహిళా భద్రత, ట్రాఫిక్ రూల్స్ వంటి అన్ని అంశాలను పర్యవేక్షించేలా ఒక సమగ్ర కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీలో చేరే సమయంలోనే నేను డ్రగ్స్ తీసుకోను అనే డిక్లరేషన్ ఫారమ్‌పై తప్పనిసరిగా సంతకం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. నిందితులకు శిక్షలు పడే శాతం 19% నుండి 28%కి పెరగడం పట్ల ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందాన్ని డీజీపీ అభినందించారు. త్వరలోనే తాను స్వయంగా జిల్లాల్లో పర్యటించి అధికారులకు శిక్షణ, ప్రత్యేక బుక్‌లెట్లు అందజేస్తానని వెల్లడించారు. ఈ సమీక్షలో ఎస్పీలు పద్మజ, సీతారాం, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story