- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మవోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
మావోయిస్టుల భారీ లొంగుబాటు అనంతరం తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల భారీ లొంగుబాటు అనంతరం తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పీఎల్‌జీఏ (PLGA) ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని స్పష్టం చేస్తూనే, పార్టీ అంతర్గత విషయాలు, ఎన్‌ఐఏ (NIA) విచారణపై కీలక క్లారిటీ ఇచ్చారు. "అడవుల్లో గడిపిన జీవితం కంటే, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాతే వారి జీవితాలు బాగున్నాయి. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా వెంటనే ఆయుధాలు వీడి లొంగిపోవాలి" అని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి మృతి చెందారన్న వార్తలపై డీజీపీ స్పందిస్తూ.. "గణపతి ఇంకా బతికే ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం అడవుల్లో లేరు. అనారోగ్య సమస్యల రీత్యా ఎప్పుడో అడవినీ వీడారు అని మాకు సమాచారం ఉంది" అని పేర్కొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నిషేధం ఎత్తివేతపై..
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్‌ను డీజీపీ తోసిపుచ్చారు. "పార్టీపై నిషేధం ఎత్తివేయాలనడం సరికాదు. ప్రజల కోసం పోరాడటానికి, ప్రజల్లో ఉండి పని చేయడానికి ఏ రాజకీయ పార్టీతోనో లేదా సాయుధ సంస్థలతోనో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా సేవ చేయవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్‌ఐఏ సోదాలు, నోటీసులపై స్పందిస్తూ.. "ఎన్‌ఐఏ నోటీసులతో తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. ఒక కేసు దర్యాప్తులో భాగంగా వారు ఎవరిని విచారించాలనుకుంటున్నారో వారికి నోటీసులు ఇస్తున్నారు, అది వారి పరిధిలోని అంశం" అని తెలిపారు. కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత బయటకు వెళ్లి తాము అరెస్ట్ అయ్యామని చెప్పుకోవడంపై డీజీపీ అసహనం వ్యక్తం చేశారు. "మేం లొంగిపోలేదు, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు అని కొందరు బయట ప్రచారం చేసుకుంటున్నారు. ఏదేమైనా.. వారు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు, అదే మాకు సంతోషం" అని వ్యాఖ్యానించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో పోలీసుల వ్యూహాలు ఫలించాయని, ఇకపై శాంతిభద్రతల పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ముగించారు.






