మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఏకంగా 2 లక్షల మంది

by Muthe.Rajitha |

ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఏకంగా 2 లక్షల మంది
X

దిశ, వెబ్ డెస్క్ : మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వనదేవతలైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో మేడారం ప్రాంతం మినీ జాతరలా కనిపించింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి, అక్కడే జంపన్న మరియు నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బెల్లం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

జంపన్న వాగు వద్ద, గద్దెల ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. ఇక జాతరకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌తో పాటు అధికారులు కూడా దేవతల దర్శనం చేసుకుని, ఏర్పాట్లను పరిశీలించారు. వారి కాన్వాయ్‌లు రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొత్తం మీద మేడారం ప్రాంతం భక్తుల కోలాహలంతో కళకళలాడింది.

Next Story