హిడ్మా అంచనాలు సరైనవి కావు.. దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-13 11:37:37  IST  )

చట్టం పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని మాజీ మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ ప్రకటించారు.

హిడ్మా అంచనాలు సరైనవి కావు.. దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టం పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని మాజీ మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ ప్రకటించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. పదవుల కోసం ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. సమాజంలో దోపిడీ పూర్తిగా తొలగిపోలేదని.. అది రూపం మార్చుకుందని చెప్పుకొచ్చారు. దోపిడీ ఉన్నంతకాలం మావోయిస్టు ఉద్యమం ఉంటుందని వెల్లడించారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసి, జైళ్లలో ఉన్న మావోయిస్టులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా ఆయన కోరారు.

దేవ్‌జీ మాటల్లో..

‘ఆపరేషన్ కగార్ యుద్ధం మొదలయ్యే సమయంలో బస్వరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. కేంద్రం పట్టించుకోనందునే ప్రతిఘటన అనివార్యమైంది. ఈ పోరాటంలో బస్వరాజును కోల్పోయాం. ఆయన మరణం అనంతరం కొందరు లోపల(అడవుల్లో).. కొందరు బయట(జనంలో) ఉండాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే హిడ్మా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలనుకున్నారు. విజయవాడలో కొందరు నమ్మకస్తులు(పోలీస్ డిపార్ట్మెంట్‌లో) ఉన్నారని చెప్పారు. మాకు అనుమానం వచ్చి వద్దని వారించాము. కానీ హిడ్మా వినకుండా మాకే సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. చాలారోజుల పాటు పరిశీలించి చివరకు ఆయన లొంగిపోయేందుకు అనుమతి ఇచ్చాం. హిడ్మా అంచనాలు సరైనవి కావు. మేము ఊహించిన విధంగానే హిడ్మాను ట్రాప్ చేసి, అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఇది వందశాతం బూటకపు ఎన్‌కౌంటర్’ అని దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరిసారిగా అగ్రనేత గణపతిని ఎప్పుడు చూశారు? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు దేవ్‌జీ స్పందిస్తూ.. ‘2023లో చివరి సారిగా కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. అప్పుడే గణపతిని చూశాను. ఇక ఆ తర్వాత ఆయన దారిలో ఆయన వెళ్లారు. మళ్లీ కనిపించలేదు’ అని దేవ్‌జీ చెప్పుకొచ్చారు.

సమాజంలో పరిస్థితులు మారినా పేదరికం, వేధింపులు తగ్గలేదు. దోపిడీ రూపం మారింది.. కానీ ఆగలేదు. ఈ పరిస్థితులపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని కీలక ప్రకటన చేశారు.

ఆపరేషన్ కగార్‌‍కు తాత్కాలిక బ్రేక్?.. మాజీ మావోయిస్టు రాజిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Next Story