- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రిలో అభివృద్ధి పనులు షురూ!
దక్షిణ అయోధ్య భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 12ఏండ్ల క్రితం

దిశ, భద్రాచలం: దక్షిణ అయోధ్య భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 12ఏండ్ల క్రితం రామాలయం మాడ వీధుల అభివృద్ధి కోసం రూ.9.5కోట్లు నిధులు విడుదల చేశారు. అప్పుడు 19మంది ఇంటి యజమానుల నుంచి స్థల సేకరణ చేశారు. కొందరు పరిహారం చాలదంటూ కోర్టును ఆశ్రయుంచడంతో, మాడ వీధుల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అనంతరం తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించినా... ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. గత ఏడాది మార్చ్ 11న సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా రామాలయం అభివృద్ధి గురించి ప్రస్తావనకు రావడంతో, రామాలయం అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ప్రకటించినదే తడవుగా.. మార్చి 27న ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం పరిసరాలు పరిశీలించారు. రామాలయం అభివృద్ధికి ఒక ఎకరం స్థల సేకరణ అవసరం అవుతుందని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇందుకు రామాలయం తూర్పు, దక్షిణం వైపు ౪౨ ఇండ్లు తొలగించాల్సి ఉంటుందని తెలపడంతో, ప్రభుత్వం భూ సేకరణ కోసం ఇండ్ల యజమానులతో చర్చించి, ఒప్పించారు. స్థల సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కొరకు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నెలలో జీఓ నెంబర్ 246 ద్వారా రూ.60.20కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది ముందుగా గృహాల యజమానులకు పరిహారం చెల్లించడానికి జీఓ నెంబర్ 93 ద్వారా రూ.34 కోట్లు నిధులు విడుదల చేయడంతో 32మంది గృహ యజమానులకు పరిహారం చెల్లించారు. 8 మంది గృహ యజమానులు తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిహారం తీసుకున్న గృహ యజమానులు ఇండ్లు ఖాళీ చేయడంతో బుధవారం నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేత మొదలుపెట్టారు.
మాస్టర్ ప్లాన్ సిద్ధం
స్థల సేకరణ పూర్తయిన తర్వాత రామాలయాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మూడు అంతస్థులలో పిరమిడ్ ఆకారంలో నిర్మించనున్న రామాలయంలో 50వేల మంది భక్తులు ఒకేసారి క్యూ లైన్‌లో వేచి ఉండేలా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకూ గోదావరి తీరంలో ఉన్న కేశ ఖండన శాల నూతనంగా నిర్మించే ఆలయ ప్రాంగణంలో భక్తులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. అంతే కాకుండా ఒకేసారి 3వేల మంది భక్తులు స్వామి వారి ప్రసాదం స్వీకరించేలా అతిపెద్ద డైనింగ్ హాల్ నిర్మాణం జరగనుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్లే భక్తులకు భద్రాచల క్షేత్ర మహత్యం తెలిపేలా అద్భుత శిల్పాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం తానిషా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న కార్యనిర్వాహణాధికారి కార్యకలాపాలు సైతం నూతనంగా నిర్మించే ఆలయ ప్రాంగణంలోకి వస్తాయి. సుమారు రూ.750కోట్లు వెచ్చించి నిర్మించే ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే భద్రాద్రి ప్రపంచంలోనే అత్యంత అద్భుత ఆలయంగా ప్రసిద్ధి చెంది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది.






