విద్యుత్‌తోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

విద్యుత్‌తోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన విద్యుత్ రంగంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సీఎంతో పాటు కేబినెట్‌లోని సహచరులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణను 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. 2047 వరకు లక్ష మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27,769 మెగావాట్లుగా ఉందన్నారు. హైదరాబాద్ భవిష్యత్తులో గ్లోబల్ హబ్‌గా మారబోతున్న దృష్ట్యా విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామన్నారు.

భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు..

విద్యుత్ ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమని భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగంలో 2030 వరకు 50 శాతం గ్రీన్ ఎనర్జీనే ఉండాలని పారిస్ ఒప్పందం చెబుతోందని అన్నారు. 2070 వరకు పూర్తిగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించాలనే ఒప్పందం ఉందన్నారు. సోలార్, థర్మల్, విండ్, స్టోరేజీలలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. విద్యుత్ స్టోరేజీపై మనం ఇంతవరకు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని తెలిపారు. 2027 నుంచి 2028 వరకు థర్మల్ పవర్‌లో మనకు ఇబ్బందులు ఉండవన్నారు. 2029 నుంచి 2030 వరకు వెయ్యి మెగావాట్లు మైనస్‌లోకి వెళ్తామని అన్నారు. 2029-30 నాటికి విద్యుత్ స్టోరేజీ 8,207 మెగావాట్లు అవసరమని.. సోలార్ పవర్ కొనుగోలు చేయాలంటే 25 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Next Story