తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోడీ మీటింగ్ వివరాలు లీక్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-12-16 06:44:17  IST  )

ఇటీవల తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోడీ నిర్వహించిన మీటింగ్ వివరాలు బయటకు పొక్కడం పట్ల కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోడీ మీటింగ్ వివరాలు లీక్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అనే అభిప్రాయం ఉంది. అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలు, వెలువరించే సమాచారం అధికారికంగా వచ్చే వరకు బయటకు పొక్కదనే టాక్ ఉంది. కానీ ఇటీవల తెలంగాణ బీజేపీలో (Telangana BJP) -లీకు వీరుల వ్యవహారం హాట్ టాపిక్‍గా మారింది. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అంతర్గత మీటింగ్ వివరాలు బయట మీడియాకు పొక్కడం (PM Modi Meeting Leaks) సంచలనంగా మారింది. ప్రధాని స్థాయి వ్యక్తి చెప్పిన మాటలు బయటకు లీకు కావడం ఇప్పుడు కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోపల మోడీ చెప్పింది ఒకటి అయితే బయట ప్రచారం జరిగింది మరొకటని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు

లీకు వీరులెవరో తెలిస్తే చర్యలు తప్పవు:

గత గురువారం తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోడీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని సూచించారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీ సమావేశ (BJP MPs Meeting) వివరాలను లీక్ చేయడం కచ్చితంగా తప్పేనన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ప్రధాని మీటింగ్ వివరాలు బయటకు లీక్ చేసిన లీక్ వీరులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకు ప్రధానమంత్రి సలహాలు ఇచ్చారని స్పష్టం చేశారు.

ఆ లీకుల లీడర్ ఎవరు?:

అయితే ఇటీవల తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ బీజేపీ పార్టీలో సంచలనంగా మారింది. రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న శైలి పట్ల ప్రధాని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ విఫలం అవుతోందని అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఇక సామాజిక మాధ్యమాల్లో ఒవైసీ పార్టీ కంటే వెనకబడిపోయిందని పెదవి విరిచినట్లు కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో పార్టీ బలపడటానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపోయగించుకోవడంలో విఫలం అవుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వినిపించింది. ఇకపై సమిష్టిగా జనంలోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే నిత్యం తాము టార్గెట్ చేసే ఒవైసీ కంటే బీజేపీ వెనుకబడిందని స్వయంగా ప్రధాని చెప్పడం ఈ వివరాలు బయటకు పొక్కడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు బయటకు చెప్పిన ఆ లీడర్ ఎవరో అనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది.

ప్రధాని చెప్పినా వింటారా వినరా?:

తెలంగాణ బీజేపీని గత కొంత కాలంగా అంతర్గత విభేదాలు పట్టి పీడిస్తున్నాయనే చర్చ ఉంది. అగ్ర నేతల మధ్య సమన్వయం లోపించిందని దీంతో పార్టీ కార్యక్రమాలు, కార్యాచరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇంత మంచి సానుకూల వాతావరణం ఉన్నా ప్రభుత్వంపై పోరాటం విషయంలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదనే విమర్శలను ఆ పార్టీ మూటగట్టుకుంటోంది. ఇలాగే ఉపేక్షిస్తే పార్టీకి మరింద డ్యామేజ్ తప్పదనే నేరుగా ప్రధాని మోడీ రంగంలోకి దిగినా.. మోడీ మీటింగ్ వివరాలు బయటకు లీకు కావడం బీజేపీ పెద్దలను మరింత షాక్ కు గురి చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి లీకులపై కఠినంగా వ్యవహరించేందుకే పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డితో ఈ వ్యాఖ్యలు చేయించిందా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Next Story