రాష్ట్రంలో ఫ్యామిలీ రిజిస్టర్.. ఒకే డిజిటల్ రికార్డులో కుటుంబ సభ్యుల వివరాలు

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఫ్యామిలీ రిజిస్టర్.. ఒకే డిజిటల్ రికార్డులో కుటుంబ సభ్యుల వివరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే డిజిటల్ రికార్డులో నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ రిజిస్టర్‌లో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయనున్నారు. కుటుంబ రేషన్ కార్డు నంబర్‌ను ఫ్యామిలీ రిజిస్టర్ ఐడీగా పరిగణించనుండగా, కుటుంబ పెద్ద పేరు, ప్రతి సభ్యుడి పేరు, కుటుంబ పెద్దతో సంబంధం, వయస్సు, జనన తేదీ, లింగం, ఆధార్ నంబర్‌తోపాటు పూర్తి చిరునామా వంటి వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్ నుంచి సేకరించి ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో 172 జారీ చేశారు.

అధికారిక రికార్డు మాత్రమే..

ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కుటుంబ వివరాల ధ్రువీకరణ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. ఈ సర్టిఫికెట్‌ను ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై హక్కును నిర్ధారించే పత్రంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఇది కేవలం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారిక రికార్డు మాత్రమేనని తెలిపింది. కుటుంబ రిజిస్టర్ కాపీ కోసం కుటుంబంలోని మేజర్ సభ్యుడు మీ సేవా కేంద్రం లేదా మీ సేవా ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో కుటుంబ రేషన్ కార్డు నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణయించిన సేవా రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు స్వీకరించిన రెండు పని దినాల్లో సర్టిఫికెట్ అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ సేవల కోసం కుటుంబ వివరాల ధ్రువీకరణ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉన్నది.

జీవోలోని ముఖ్యాంశాలు..

ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కుటుంబ వివరాల ధ్రువీకరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు చేసి, మీ సేవా ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. ఫ్యామిలీ రిజిస్టర్‌లో ప్రతి కుటుంబానికి ఈ వివరాలు నమోదు చేయబడతాయి. ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(రేషన్ కార్డు నంబరే ఉంటుంది), కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ పెద్దతో ప్రతి సభ్యుని సంబంధం, ప్రతి సభ్యుని వయస్సు, పుట్టినతేది, లింగం, ఆధార్ నంబర్, పూర్తి చిరునామా (డోర్ నంబర్, వీధి, గ్రామం/వార్డు, గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ, మండలం, జిల్లా) ఉంటాయి. అలాగే.. ఫ్యామిలీ రిజిస్టర్‌లోని వివరాలు ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు) డేటాబేస్ నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో పొందుపరుస్తారు. ఫ్యామిలీ రిజిస్టర్ లేదా దాని ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇందులో కుటుంబ వివరాల రికార్డు మాత్రమే ఉంటాయి. ఆస్తి హక్కు, యాజమాన్యం లేదా వారసత్వ హక్కును నిర్ధారించదు. ప్రభుత్వ పథకాలపై హక్కును కూడా కల్పించదు. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అనే కొత్త సేవను మీసేవాలో రెవెన్యూ శాఖ సేవల కింద ప్రవేశపెడతారు. ప్రతి పౌరుడు తన కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ రిజిస్టర్ ప్రతిని మీసేవా కేంద్రం లేదా మీ సేవా ఆన్‌లైన్ పోర్టల్/మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి పొందవచ్చు. దరఖాస్తు నిర్ణీత నమూనాలో ఉండాలి. అందులో కుటుంబ ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి. ఫ్యామిలీ రిజిస్టర్‌లో పేరు ఉన్న 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుడు మాత్రమే ఆ కుటుంబ ఫ్యామిలీ రిజిస్టర్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్

ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీకి ఆమోదం తెలిపే అధికారం ఉంటుంది. మీ సేవా ద్వారా సమర్పించిన ప్రతి దరఖాస్తు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులో నమోదైన చిరునామా ఆధారంగా సంబంధిత తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. తహసీల్దార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్‌లోని వివరాలతో దరఖాస్తును పరిశీలించి, వివరాలు సరైనవని నిర్ధారించిన తర్వాత తన డిజిటల్ సంతకంతో దరఖాస్తును ఆమోదిస్తారు. ఆమోదం అనంతరం, అనుబంధం–I నమూనాలో ప్రత్యేక సర్టిఫికెట్ నంబర్, తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ రూపొందించి, దానిని మీ సేవా ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచుతారు. తహసీల్దార్లు దరఖాస్తులను నిర్ణీత గడువు అయిన 2 పని దినాల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలను తమ పరిధిలోని రెవెన్యూ అధికారులకు తెలియజేసి, ఈ సేవ అమలును పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Next Story