తెలంగాణ రెవెన్యూ శాఖలో భూదందా.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెండ్

by Gantepaka Srikanth |

ప్రస్తుతం రెవెన్యూ శాఖ‌లో డిప్యూటీ క‌లెక్టర్ గా ప‌ని చేస్తోన్న రాము నాయక్ ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సస్పెండ్ చేశారు.

తెలంగాణ రెవెన్యూ శాఖలో భూదందా.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రెవెన్యూ శాఖ‌లో డిప్యూటీ క‌లెక్టర్ గా ప‌ని చేస్తోన్న రాము నాయక్ ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సస్పెండ్ చేశారు. ఆయన 2013 నుంచి 2018 వ‌ర‌కు డిప్యూటేష‌న్‌పై హౌజింగ్ బోర్డులో భూ సేకరణ అధికారిగా బాధ్యత‌లు నిర్వహించారు. ఈ స‌మ‌యంలో అనేక‌ భూ దందాల‌కు, అక్రమ రిజిస్ట్రేష‌న్లకు పాల్పడిన‌ట్లు ప్రాధ‌మికంగా నిర్ధార‌ణ కావ‌డంతో త‌క్షణ‌మే రామునాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రక‌టించారు. హైద‌రాబాద్, క్యూర్ ప‌రిధిలో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కోసం హౌజింగ్ బోర్డు భూముల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో రాము నాయక్ భూ లీలలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌న్నారు. బ‌హిరంగ మార్కెట్లో గ‌జం రూ.2 లక్షలకు పైగా విలువ చేసే హై కోర్టు 5-6 గేట్ల మ‌ధ్య ఉన్న తెలంగాణ‌ హౌజింగ్ బోర్డుకు చెందిన 33.53 చ‌ద‌ర‌పు గ‌జాల‌ స్థలాన్ని రామునాయక్ 2018 ఫిబ్రవ‌రి 17న అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డిందన్నారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రుప‌గా రాము నాయక్ భూ దందాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. రాము నాయిక్ హౌజింగ్ బోర్డు ఎల్ఏవోగా, బోర్డులో వ‌ర్క్ ఇన్స్‌పెక్టర్‌ గా ప‌ని చేసి ఉద్యోగం నుంచి తొల‌గింప‌బ‌డిన‌ ఇఫ్తాక‌ర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేశారని, ఆ డ‌బ్బులు కూడా నేటి వ‌ర‌కు బోర్డుకు జ‌మ‌ కాలేదన్నారు. ఈ భూమికి సంబంధించిన ప‌త్రాల‌ను బోర్డు అనుమ‌తుల‌ను ప‌రిశీలించ‌కుండా రిజిస్ట్రేష‌న్ చేసిన నాటి చార్మినార్ స‌బ్ రిజిస్ట్రార్ పై కూడా విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. కాల‌ క్రమంలో 2025 ఏప్రిల్ లో ఈ భూమిని సుబియా సుల్తానా మ‌రొక‌రికి విక్రయించారు. ఈ మొత్తం వ్యవ‌హారంపై కూడా ప్రభుత్వ ప‌రంగా త‌గు విచార‌ణ జ‌రిపిస్తున్నామ‌న్నారు. తీగ‌ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా రాము నాయక్ అక్రమాలు ఒక్కొక్కటి బ‌య‌ట‌ ప‌డ్డాయ‌న్నారు.

అనేక కేసులు..

రాము నాయక్ భూ దందాల‌కు సంబంధించి 2017 నుంచి ప‌లు కేసులు ఉన్నాయ‌ని, అప్పట్లో బీఆర్ఎస్ పాల‌కులు, అధికారులు స్పందించ‌లేద‌ని మంత్రి తెలిపారు. విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో 400 చ‌ద‌ర‌పు గ‌జాలు, తుల్జాగూడ‌లో 22 చ‌ద‌ర‌పు గ‌జాలు, ల‌క్ష్మిగూడ‌లో 130 చ‌ద‌ర‌పు గ‌జాలు, మ‌హ‌బూబ్ గంజ్‌లో 497 చ‌ద‌ర‌పు గ‌జాల స్థలాల‌ను ప‌లువురి పేరిట అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించార‌ని, వీటిపై ఇప్పటికే లోతైన విచార‌ణ జ‌రుపుతున్నామ‌న్నారు. ఈ కేసుల్లో స‌బ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా విచార‌ణ జ‌ర‌పాల‌ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఐజీని ఆదేశించామ‌న్నారు. ప్రభుత్వ అధికారిగా అక్రమాల‌కు పాల్పడిన రామునాయక్‌ను త‌క్షణ‌మే స‌స్పెండ్ చేశామ‌ని, యుద్ద ప్రాతిప‌దిక‌న విచార‌ణ పూర్తి చేసి అన్ని ఆధారాల‌ను నిర్ధారించిన త‌ర్వాత‌ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌న్నారు. రాము నాయక్ భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించిన సూప‌రింటెండెంట్ వివేకానంద్ రిటైర్మెంట్ మ‌రో ప‌ది సంవ‌త్సరాలు ఉండ‌గానే విధుల నుంచి శాశ్వతంగా తొల‌గించామ‌ని, మ‌రో సూప‌రింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేశామన్నారు.

ఎవరినీ వదిలిపెట్టం..

ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హత లేదు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తులను దోచుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం కఠిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Next Story