DCM: భవిష్యత్తులో హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులే: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

DCM: భవిష్యత్తులో హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులే: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad development) హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ 15వ NAREDCO ప్రాపర్టీ షోను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పట్టణ అభివృద్ధి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సీవరేజ్ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వేలంలో ఎకరం రూ.177 కోట్లు పలికిందంటే, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థమవుతుందని అన్నారు.

ఇతర ఏ నగరంలో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతోందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు కల్పించామన్నారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు.. నరెడ్కో ప్రతినిధులు తమ CSR నిధులను విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో వినియోగించాలని సూచించారు. విల్లాలు, హై రైజ్ భవనాలకే పరిమితం కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోందని అన్నారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

Next Story