బీఆర్ఎస్ కుట్రలను చేధించాం.. గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో భట్టి

by Prasad Jukanti |   (  Updated:2025-10-18 13:19:23  IST  )

గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.

బీఆర్ఎస్ కుట్రలను చేధించాం.. గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు పదేళ్ల పాటు ఎదురు చూశారని వారందరి ఎదురుచూపులకు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఫలితం లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించిన గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రజలకు ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు. నా అనుభవంలో ఒకే సారి ఇంత భారీ సంఖ్యలో నియామక పత్రాలు ఇచ్చిన ఘటన గతంలో చూడలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు ఆశించారని, ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వం యువత ఆశల గురించి ఆలోచించకుండా కేవలం వారి కుటుంబం బాగుపడితే చాలు అనుకున్నదని విమర్శించారు. పదేళ్ల పాటు ఒకే కుటుబంలోని వారికే ఉద్యోగాలు వచ్చాయి ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు. దాంతో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మాకు భవిష్యత్ లేదని నిరుద్యోగులంతా భావించారు కాబట్టే ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్-1 నియామక పత్రాలు అందజేశాం. ఇప్పుడు గ్రూప్-2 నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అందుకే వాటిని అధిగమించామన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉద్యోగ విరమణ వరకు ఓకే ప్రజాసేవలో అంకితభావంతో పని చేయాలని నియామక పత్రాలను అందుకున్న వారికి సూచించారు. రైజింగ్ తెలంగాణ 2024 లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఉద్యోగాలు పొందడం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని కార్పొరేట్ వ్యవస్థలోని ఉద్యోగాలు కూడా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Next Story