HCUతో నాక్కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంది.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

HCUతో నాక్కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంది.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుదిళ్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​ కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదని, ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. హెచ్‌సీయూకు కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2004 ఫిబ్రవరి 3న రెవెన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 191.36 ఎకరాలు, సర్వేనెంబర్ 37లో 205.20 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని వెల్లడించారు. నాటి ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో డాక్టర్​వైఎస్​రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాడి విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్‌కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజీ భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో (డబ్ల్యూపీ నెం. 24781) ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.‌ పిటిషన్‌పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారన్నారు.

గాలికొదిలేసిన గత పాలకులు..

స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న ఈ భూమిని పట్టించుకోకపోగా గాలికి వదిలేశారని భట్టి స్పష్టం చేశారు. కోట్లాది విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరో రకంగా గత పాలకులు వారి చేతుల్లోకి తెచ్చుకోవాలనే కుట్ర చేశారని ఆరోపించారు. అందుకే వారు న్యాయస్థానంలో గట్టిగా కొట్లాడ లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమి రాష్ట్ర సంపద, ప్రజల ఆస్తిగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి మండలి కూర్చొని ఆలోచన చేసి ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి న్యాయవాదులను నియామకం చేసి న్యాయస్థానంలో కొట్లాడి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఇది ప్రజల విజయమని అన్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రశంసించాల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలకుల మాదిరి ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యి ఉండేదన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, వారి మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టబోమని వెల్లడించారు.

యువతకు ఎంప్లాయిమెంట్ మా ఆలోచన

లక్షల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి అప్పగించామే తప్ప ఇందులో వ్యక్తిగత స్వార్థం లేదని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీలో ఫేస్ 1, ఫేస్ 2కు పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని తెలిపారు. దీని వల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపెనీలు పెట్టడం ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయని చెప్పారు. అలా చేయండం ద్వారా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందన్నారు. అదే తరహాలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో సంపద సృష్టించి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో దానిని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదని వివరించారు. టీజీఐఐసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్‌లో ఈ భూముల్లో ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్, దానిలో భాగంగా మష్రూమ్ రాక్‌ను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ ప్రాంతాలను లే అవుట్ నుండి మినహాయించామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో తనకు వ్యక్తిగతంగా బాండింగ్ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.‌ యూనివర్సిటీ మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అక్కడ చదివిన ప్రతి విద్యార్థికి బయటకు రాగానే ఉద్యోగాలు రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదని స్పష్టం చేశారు.

ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

హైదరాబాద్​శివారు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తి అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్​సెంట్రల్​యూనివర్సిటీకి సంబంధించి కొన్ని అపోహలు, ఆ భూమికి సంబంధించిన అనుమానాలు దానికి తోడు అక్కడ గందరగోళం సృష్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్​నేతలు ప్రయత్నిస్తున్నారని.. వాస్తవ వివరాలు ప్రజలకు తెలిపేందుకే తాము ముందుకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదని సూచించారు. ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటివరకూ ఒక్క ఎకరం భూమిపై కూడా హెచ్‌సీయూకు చట్టబద్ధ హక్కులు లేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడేమో పని గట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది అసత్యమని వెల్లడించారు. ప్రకృతిని పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. తాము చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామని, తప్పుడు ప్రచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ముసుగులో బీఆర్‌ఎస్​అరాచకం: మంత్రి పొంగులేటి

విద్యార్థుల ముసుగులో బీఆర్ఎస్​వ్యక్తులు అరాచకానికి పాల్పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల అంశంపై రాద్ధాంతం చేస్తున్న వారికి హెరిటేజ్​ బిల్డింగులకు అనుమతి ఇచ్చేటప్పుడు పర్యావరణం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. జంతువులు చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో చూపుతున్న చిత్రాలు పాతవని స్పష్టం చేశారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులేనన్నారు. అక్కడి బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని తెలిపారు.

హెచ్‌సీయూ భూముల విషయమై సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం నిర్వహించగా.. హెచ్‌సీయూలో నెలకొన్న ఆందోళనలపై సీఎం చర్చించారు. భూముల వివరాలను మంత్రులకు సీఎం అందజేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వానికి ఉన్న హక్కులు, వాటిపై ప్రభుత్వ ప్రణాళికలతోపాటు ఈ అంశంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే.. హెచ్‌సీయూలో విద్యార్థి సంఘం నేతలను, అక్కడి సిబ్బందిని రాజకీయంగా రెచ్చగొట్టి ఆందోళనలు చేస్తున్నారనే అంశాలను సైతం చర్చించినట్లు తెలిసింది. ఈ ఆందోళనలపై వ్యవహరించాల్సిన తీరు, ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా ఎలా వ్యవహరించాలో విషయమై మంత్రులు పలు సూచినట్లు చేసినట్లు సమాచారం.

ప్రజాసంఘాలతో భట్టి భేటీ

కంచ భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాసంఘాలతో భేటీ అయ్యారు. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరామ్‌తోపాటు పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్‌సీయూ భూముల వివాదం, కేటాయింపులు, కోర్టు కేసులపై ప్రజాసంఘాలకు వివరాలు అందించినట్లు తెలిసింది.

Next Story