చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ దక్కినట్లేనా?

by Pulgam srinivas |

ఆసక్తికరమైన కథనం, బలమైన ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ దక్కినట్లేనా?
X

దిశ, వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, 'క', 'కె ర్యాంప్' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరంకి మరో విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

నివి (శ్రీ గౌరీ ప్రియ) ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుంది. అయితే పెళ్లి పీటలపైనే అతను తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను వదిలి వెళ్లిపోతాడు. ఈ ఘటనతో నివి తీవ్ర మానసిక వేదనకు గురై మద్యం బానిసగా మారుతుంది. ఆమె జీవితం పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను చెన్నైకి పంపిస్తారు.

చెన్నైకి వెళ్లిన తర్వాత కూడా నివి పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించదు. అలాంటి సమయంలో ఆమె ఉంటున్న గదిలోకి స్టీఫెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) రావడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే వీరి ప్రేమ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏమిటి? గతం నుంచి నివి ఎలా బయటపడింది? చివరికి వీరి ప్రేమ గమ్యం ఏమైంది? అన్నదే మిగతా కథ.

దర్శకుడు రవి నంబూరి సాధారణ ప్రేమకథకు భావోద్వేగాలను జోడిస్తూ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. తొలి భాగంలో కొన్ని సస్పెన్స్ అంశాలతో కథను ముందుకు నడిపించగా, రెండో భాగంలో ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భావోద్వేగాలు ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేసేలా ఉంటాయి.

కిరణ్ అబ్బవరం మరోసారి తన పాత్రకు న్యాయం చేశాడు. స్టీఫెన్ శంకర్ పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్రలోని బాధ, భావోద్వేగాలను చక్కగా పలికించి మంచి మార్కులు సంపాదించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో ఉంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు మరింత బలం చేకూర్చాయి.

మొత్తంగా చూస్తే 'చెన్నై లవ్ స్టోరీ' ఒక మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించే అవకాశం ఉంది. కథనం, నటీనటుల ప్రదర్శన, సాంకేతిక విలువలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. దీంతో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో విజయవంతమైన చిత్రం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేటింగ్ : 3

Next Story