TG: చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకొచ్చిందని.. ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

TG: చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకొచ్చిందని.. ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సైతం పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కాలుష్యకారక పరిశ్రమలంన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని కంపల్సరీ చేస్తే అందరూ వెళ్లిపోతారని కొందరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధులు స్వయంగా చెప్పినప్పటికీ, తాము అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకుపోతున్నామని వివరించారు. యూడీఎల్ (అన్‌ డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలన్నారు.

పారిశ్రామిక పార్కులు ఏర్పాటు..

ఔటర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని.. చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారు. ఈ సూచనలను స్వాగతిస్తున్నామని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని.. నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఈ కేబినెట్ లక్ష్యమని అన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్‌తో కూర్చొని చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేసుకుందామని సూచించారు. పాలసీ గైడ్‌లైన్స్ రూపొందించే ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ల ప్రతినిధుల ఆలోచనలకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలని.. కాలుష్యం ఉండకూడదు ఈ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉన్నదని కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేశామని వెల్లడించారు.

హిల్ట్ పాలసీని ఆహ్వానిస్తున్నాం: చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం పాలసీని ఇష్టారాజ్యంగా అమలు చేసుకుంటూపోతే తమ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడతారని కొంతమంది నాయకులు తమను పిలిచి చెప్పారని అన్నారు. అయితే.. ఇది ప్రభుత్వ నిర్ణయమని.. జీవో ప్రకారం అమలు జరుగుతుందని తెలిపానని చెప్పారు. ప్రస్తుతం తాము ఉంటున్న భూములను 30 ఏళ్ల క్రితమే ఆనాటి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని.. తమ వద్ద సేల్ డీడ్‌లు సైతం ఉన్నాయని వివరించినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ అమలులో ఎక్కడా క్యాష్ ట్రాన్స్‌ఫర్ లేదు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధిగా తాము వారికి స్పష్టం చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story