ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వజ్రం లాంటోడు.. డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వజ్రం లాంటోడు.. డిప్యూటీ CM భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప కార్యక్రమం “ఇందిర సౌర గిరి జల వికాసం పథకం” అని అన్నారు. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం వంటి నినాదాలను చట్టంగా మారుస్తున్న ఈ ప్రభుత్వంలో భాగం అవ్వడం వల్ల నా జన్మ ధన్యమైందని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వజ్రం లాంటోడని.. ఆయన హృదయ అంతరాల్లోంచి ఈ పథకం ఉద్భవించిందని భట్టి విక్రమార్క చెప్పారు. భూమి కోసం ఈ గడ్డపై పోరాటాలు జరిగాయని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని అన్నారు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలని చెప్పారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, భూములే కాదు వాటిని చదును చేసేందుకు నిధులు ఇస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రతి పైసా ప్రజలకే ఖర్చు చేస్తోందని, నిత్యం ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనే ఈ కార్యక్రమం తెచ్చామని, తమపై చేసే అనవసర విమర్శలను కుట్రలగానే చూస్తామని అన్నారు. సంపద సృష్టిస్తాం.. సృష్టించిన సంపద పేదలకు పంచుతాం.. ఇదే తమ నినాదమని భట్టి చెప్పారు.

Next Story