Deputy CM Bhatti: ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు

by Gantepaka Srikanth |

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఏపీహెచ్ఎంఈఎల్(ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

Deputy CM Bhatti: ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఏపీహెచ్ఎంఈఎల్(ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్‌ను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజినీరింగ్ సంస్థలకు ఏపీహెచ్ఎంఈఎల్ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు నిబద్ధత అవసరమని, తాము సైతం ప్రపంచంతో పోటీ పడగలమని నిరూపించాలని సూచించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీ‌ని నియమిస్తామని చెప్పారు.

స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని.. దాని ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని.. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని.. రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చు అని తెలిపారు. సంస్థను, ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలని.. యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలని.. రంగులు వేయాలని ఆదేశించారు. సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని.. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్‌కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మతు వరకే పరిమితం కాకుండా దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకొని బీహెచ్ఈఎల్ మాదిరి పనిచేస్తుందని తెలిపారు. థర్మల్ పవర్ స్టేషన్స్‌కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మతు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి చైర్మన్, ఎండీ బలరామ్, అధికారులు పాల్గొన్నారు.

Next Story