మూడు నెలల్లో పూర్తి చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

by Vemula.Srinu Prasad |

సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80% పూర్తయిన వాటిని యుద్ద ప్రతిపదికన రాబోయే మూడు నెలల్లో పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు...

మూడు నెలల్లో పూర్తి చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80% పూర్తయిన వాటిని యుద్ద ప్రతిపదికన రాబోయే మూడు నెలల్లో పూర్తిచేసి రానున్న విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం తెలంగాణ సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి అధికారులతో మాట్లాడుతూ వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు వచ్చే విధంగా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేసవిలో వసతి గృహాల మరమ్మత్తు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆయన తెలిపారు. సంక్షేమ వసతి గృహాల అద్దెలు, ఎలక్ట్రికల్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామని సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో ఆర్థిక శాఖకు బిల్లులు పంపాలని భట్టి విక్రమార్క సూచించారు. గత ప్రభుత్వంలో ఈ బిల్లులు ఏడు నెలలకు ఒకసారి చెల్లించేవారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చెక్ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం సమీక్షించాలన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామని, సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన బిల్లులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి చెల్లిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి స్థానికంగా జరుగుతున్న బోధన, భోజనంలో నాణ్యత, సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story