ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పని చేద్దాం.. జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

by Ramesh Naini |

ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పని చేద్దాం, యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పని చేద్దాం.. జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పని చేద్దాం, యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రజా భవన్‌లో జర్మనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని మీరు క‌ల‌వ‌డం మాకు ఆనందాన్ని క‌లిగిస్తోందని, లోక్ స‌భ‌లో ప్రతిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రొగ్రెసివ్ భావ‌జాల వ్యాప్తికి కృషి చేస్తున్నారన్నారు. ఆయన మార్గ ద‌ర్శక‌త్వంలో ఇటీవల హైదరాబాదులో భారత్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగామని, వందకు పైగా దేశాలు పాల్గొని ప్రొగ్రెసివ్ ఆలోచనలు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై విస్తృత చర్చలు చేశామన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోనూ రైట్ వింగ్ భావజాలం ప్రమాదకరంగా మారుతోంది, ప్రజాస్వామ్య వ్యవస్థలకు, వాటి విలువలకు ప్రమాదం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భావజాల వ్యాప్తి వల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. సోషియల్ డెమోక్రటిక్ పార్టీ స్వతంత్ర సంస్థలా ప‌ని చేస్తూ ప్రపంచంలోని పలు రాజకీయ పార్టీలతో కలిసి ప్రోగ్రెసివ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం మంచిదన్నారు. సోషియ‌ల్ డెమోక్రటిక్ పార్టీకి 160 ఏళ్ల చరిత్ర ఉందని తెలిసి ఆనందంగా ఉందని, మీ పార్టీలాగే తాము కూడా వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన అతిపెద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన వార‌సులమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకు రావడంతో పాటు దేశ నిర్మాణంలో అత్యంత కీలకంగా నిలిచిన పార్టీకి చెందిన వారసులమని ఆయన చెప్పారు. రైగ్ వింగ్ భావ‌జాలం వ‌ల్ల ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్గిస్తోంది, విద్వేషం ప్రభలుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ స‌మావేశంలో మంత్రి పొన్నం ప్రభాక‌ర్, టీపీసీసీ చీఫ్​మ‌హేష్ కుమార్ గౌడ్, ఎంపీలు చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు ర‌వి, బ‌ల‌రామ్ నాయ‌క్, సురేష్ షెట్కార్, జ‌ర్మనీకి చెందిన ఫ్రెడ్రిచ్ ఈబ‌ర్ట్ స్టిఫ్టింగ్ సంస్థకు చెందిన ప్రతినిధులు స‌బీనా, మిక్రో గ్యాంథ‌ర్, క్రిస్టోఫ‌స్, మాండ్వి కుల‌క్షేత్ర, అనురాగ్ శంక‌ర్ త‌దితరులు పాల్గొన్నారు.

Next Story