- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ కోసం తెలంగాణ సర్కార్ కీలక ముందడుగు! హిమాచల్ సీఎంతో భట్టి సమావేశం
రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర విద్యుత్ (electricity) సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (BOOT) బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను ఆహ్వానించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖకు చెందిన అధికారి బృందం హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా వారు హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే, ఎస్ఈఎల్ఐ (SELI) హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (400 మెగావాట్లు), మియార్ (MIYAR)హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (120 మెగావాట్లు) ప్రాంతాలను పరిశీలించారు. తమ అధ్యయనంలో, 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై సిఫార్సు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తో సమావేశమయ్యారు. (Himachal Pradesh) హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈఎల్ఐ (SELI) (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా అధికారికంగా ఒక లేఖను సమర్పించింది.
ఈ సందర్భంగా (MoU) ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హిమాచల్ ప్రదేశ్ సీఎం కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసిన అనంతరం త్వరితగతిన ఎంవోయూపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడుతుంది. ఫలితంగా ప్రస్తుత రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత బలపడేందుకు ఉపయోగ పడుతుందని భట్టి పేర్కొన్నారు.






