సింగరేణి కార్మికులకు డిప్యూటీ CM భట్టి కీలక హామీ

by Gantepaka Srikanth |

వేతనాలు పెంచాలని, లాభాలా వాటా రూ.20 వేలకు పెంచాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు(Singareni Contract Workers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను కోరారు.

సింగరేణి కార్మికులకు డిప్యూటీ CM భట్టి కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: వేతనాలు పెంచాలని, లాభాలా వాటా రూ.20 వేలకు పెంచాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు(Singareni Contract Workers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణిలో కాంటాక్ట్ కార్మికుల శ్రమతోనే లాభాలు వస్తున్నాయని.. అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భట్టి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు రూ.1285 చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూ.541 మాత్రమే చెల్లిస్తున్నారని.. ఫలితంగా ఒక్కో కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు రూ.744, నెలకు రూ.19,344 నష్టపోతున్నారని తెలియజేశారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఏపీఎండీసీ స్టీల్ ఐటీసీ సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జీఓకు అదనంగా మూడు వేల నుండి రూ.5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేషియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఓల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని.. ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవోకు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, కేటగిరీ ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.

ఉప ముఖ్యమంత్రి హామీ :

కార్మికుల వినతిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి.. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి వేతనాలు పెంచేందుకు, లాభాల వాటా పెంచేందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

Next Story